AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ‘ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..!

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిషి భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అతిషిని ఫేక్ కేసులో అరెస్ట్ చేయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. తప్పుడు ఆరోపణలు చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దాన్ని ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని అతిషి స్పష్టం చేశారు.

'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ' అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..!
Delhi Cm Atishi, Arvind Kejriwal
Balaraju Goud
|

Updated on: Dec 25, 2024 | 1:07 PM

Share

ఢిల్లీలో ఆప్ వర్సెస్‌ బీజేపీగా మారింది రాజకీయం.. కొద్దిరోజులుగా అక్కడ ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఓ సంచలన బాంబ్‌ పేల్చారు. తర్వలో అతిషిని అరెస్ట్‌ చేస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని త్వరలో అరెస్ట్ చేయనున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అతిషి అరెస్ట్ కంటే ముందుకు కొందరు నేతల ఇళ్లలోనూ సోదాలు చేస్తారంటూ ఆరోపించారు. ఆప్ ప్రకటించిన మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన పథకాలపై ప్రజల్లో ఆదరణ దక్కడంతో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని మండిపడ్డారు. ఇటీవల ED, CBI, IT సమావేశం జరిగింది. త్వరలో తమ నాయకులందరిపై దాడి ఉంటుంది. రవాణా శాఖలో అతిషీపై ఫేక్ కేసు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆమెను అరెస్ట్ చేసి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు BJPకి మింగుడు పడడం లేదని కేజ్రీవాల్‌ విమర్శించారు. మహిళా సమ్మాన్‌ యోజన, సంజీవనీ యోజనా స్కీమ్‌లు వాళ్లను కలవర పెడుతున్నాయని, అందుకే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బ తీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని కైవశం చేసుకోవాలని ఆప్‌ పట్టుదలగా ఉంది. ఈ టైమ్‌లో.. ఆప్‌-BJPల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి ఉంది. ఏకంగా CMపైనే ఫేక్ కేసు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. మాజీ CM కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనంగా మారింది.

రవాణా శాఖకు సంబంధించిన ఏదో ఒక విషయంలో తనపై ఫేక్ కేసు పెడుతున్నట్లు సమాచారం అందిందని ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. నిజాయితీగా పనిచేశామని, నిజం బయటకు వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఏది ఫేక్ కేసు అయినా నిజమే గెలుస్తుందని అతిషి స్పష్టం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దాన్ని ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని అతిషి స్పష్టం చేశారు.

వీడియో చూడండి.. 

మరిన్ని