AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Protest: ప్రధాని మోడీకి బిలావల్ క్షమాపణ చెప్పాల్సిందే.. పాకిస్థాన్ ఎంబసీని చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

BJP Protest: ప్రధాని మోడీకి బిలావల్ క్షమాపణ చెప్పాల్సిందే.. పాకిస్థాన్ ఎంబసీని చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు..
Bjp Protest
Shaik Madar Saheb
|

Updated on: Dec 17, 2022 | 12:46 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఢిల్లీ, ముంబై సహా అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాక్ మంత్రి బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ‘గుజరాత్ కసాయి’ అంటూ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరమని.. దీనికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం దగ్గర పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి.. పాకిస్తాన్ డౌన్ డౌన్, బిలావల్ భుట్టో జర్దారీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.

బీజేపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్ రాయబార కార్యాలయం వైపు ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేశారు. అయితే, నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని ఎంబసీ వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో చాణక్యపురి ప్రాంతంలో రెండో వరుస బారికేడ్ల వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక్కడ వాటర్ కానన్లు కూడా మోహరించారు. నిరసనల మధ్య కొందరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

విజయవాడలో భారీ నిరసన..

పాకిస్థాన్ మంత్రి బిలావల్ బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. బీజేపీ సిటీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్థాన్ మంత్రి బిలావల్ బుట్టో.. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలంటూ చూసించారు. పాక్ భూ భాగంలోకి వచ్చి దాడులు నిర్వహించామని.. పాకిస్థాన్ గుండెల్లో భారత్ నిద్రపోతుందని పేర్కొన్నారు. మోదీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భారత జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా.. యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ వేదికగా ఈ ఉగ్రవాదం ఇంకెన్నాళ్లంటూ పాకిస్తాన్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు.. ఇది మీ మంత్రిని అడగండంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని పాక్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఒక బిన్‌ లాడెన్‌ చనిపోయాడు.. కానీ ఇంకో బిన్‌ లాడెన్‌, గుజరాత్‌ కసాయి ఇంకా బతికే ఉన్నాడంటూ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో పీఎం నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్.. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిందేమో.. భారత్‌లో ఇప్పుడున్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాంగమంత్రి అంటూ ప్రధాని మోదీ, జైశంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

వివాదానికి కారణమైన బిలావల్ భుట్టో కామెంట్స్..

అంతకుముందు.. ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్‌.. బిన్‌ లాడెన్‌కి ఆశ్రయమిచ్చింది.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది.. ప్రపంచానికి తెలుసంటూ.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. పాక్ పై విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని.. జైశంకర్‌ తూర్పారపట్టడంతో తట్టుకోలేక భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదనికి దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..