Bengaluru News: బెంగుళూరులో పోలీసు కస్టడీలో కాంగో దేశస్థుడొకరు మరణించడంతో ఆఫ్రికన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిషిద్ధ డ్రగ్స్ ను కలిగిఉన్నాడన్న ఆరోపణపై కాంగో దేశానికి చెందిన జోయెల్ మాలు అనే యువకుడిని పోలీసులు గత ఆదివారం అరెస్టు చేశారు. అయితే కస్టడీలో ఆ యువకుడు మరణించాడు. మాలు గుండెపోటుతో మరణించాడని, ఇతర శారీరక రుగ్మతలు కూడా అతనికి ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో తమ దేశస్థుడు మరణించాడని తెలియడంతో ఆఫ్రికన్లు స్థానిక జేసీ నగర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరి ఆందోళనకు దిగారు. జోయెల్ మరణానికి గుండెపోటు కారణం కాదని, పోలీసుల దెబ్బల వల్లే అతడు చనిపోయాడని వారు ఆరోపించారు. బారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆరుగురు ఆఫ్రికన్లు గాయపడ్డారు.పెనుగులాటలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు.
నగరంలో ఆఫ్రికన్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ హక్కులను పరిరక్షించేందుకు ఏర్పడిన పాన్ ఆఫ్రికన్ ప్రొటెక్షన్ అనే సంస్థకు చెందిన సభ్యులు వీరని తెలిసింది. కాగా జోయెల్ మృతిపై దర్యాప్తును ప్రారంభిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇతని వీసా కాలపరిమితి 2017 లోనే ముగిసినా ఇంకా చట్ట విరుద్ధంగా ఇక్కడే ఉంటున్నాడని వారు చెప్పారు. అయితే భారతీయ పోలీసులు జాతి వివక్షను పాటిస్తున్నారని, మాటిమాటికీ డ్రగ్స్ ఆరోపణలపై ఆరెస్టు చేసి తమను వేధిస్తున్నారని ఆఫ్రికన్లు ఆరోపిస్తున్నారు. అటు దేశ సిలికాన్ వ్యాలీగా పాపులర్ అయిన బెంగుళూరు డ్రగ్స్ రాజధానిగా మారుతోందని తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో రెండున్నర వేల కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మూడు వేలకు పైగా కేసులు పెట్టారు. ఇటీవలే ఓ ఆఫ్రికన్ దేశస్థుడి నుంచి 32 లక్షల విలువ చేసే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.