Cyrus Mistry: మిస్త్రీ కారు నడిపింది ఆమే.. ఓవర్‌టెక్ చేస్తుండగా.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
సైరస్ మిస్త్రీ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీతోపాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిస్త్రీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో వస్తుండగా
Cyrus Mistry death: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) రోడ్డు ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన అందరినీ కలచివేసింది. సైరస్ మిస్త్రీ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీతోపాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిస్త్రీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు మరొకరు మృతి చెందారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు పలు కారణాలు ప్రాథమికంగా గుర్తించారు. సైరస్ మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ కారును ముంబయికి చెందిన అనహిత పండోలే (55) అనే గైనకాలజిస్ట్ నడిపినట్టు పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి బయల్దేరి ముంబైకి వస్తుండగా.. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్ టేక్ (లెఫ్ట్) చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో గైనకాలజిస్ట్ అనహిత పండోల్ (55), ఆమె భర్త డారియస్ పండోల్ (60) సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. మిస్త్రీ (54), డారియస్ సోదరుడు జహంగీర్ పండోల్ ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన మధ్యాహ్నం 3 గంటలకు ముంబైకి 120 కిమీ దూరంలో జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే.. కారు వేగంతో వస్తుందని.. మిస్త్రీ, జహంగీర్‌లు వెనుక సీట్లలో ఉన్నారని అధికారి తెలిపారు. అనాహిత, డారియస్ ముందు సీటులో ఉన్నారని పేర్కొన్నారు. ముందున్న వారు గాయాలతో బయటపడగా.. వెనక సీట్లలో కూర్చున్న వారు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వివరించారు.
ఈ ప్రమాదంపై అక్కడే రోడ్డు పక్కన గ్యారేజీలో పనిచేస్తున్న ఓ ప్రత్యక్ష సాక్షి పలు విషయాలను చెప్పాడు.. ‘‘ఈ కారును ఓ మహిళ నడిపారు. మరో వాహనాన్ని (ఎడమవైపు నుంచి) ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. వాహనంపై నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు’’ అని వివరించాడు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాము, కానీ వాహనాన్ని లేదా గాయపడిన వ్యక్తులను తాకలేదన్నాడు. 10 నిమిషాల్లో అత్యవసర సేవా వాహనాలు వచ్చాయని.. ఇద్దరు గాయపడిన వ్యక్తులను కారు నుంచి బయటకు తీసి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారన్నాడు. మిగిలిన ఇద్దరు మరణించారని వివరించారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..