Cyclone Asani Live Updates: తీరంవైపు దూసుకొస్తున్న అసని తుఫాన్.. ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..
Weather Live Updates: తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. అసని తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 410 కి.మీ..పూరీకి దక్షిణంగా 510 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది.
అసని తుఫాన్(Cyclone Asani) అలజడి రేపుతోంది. తీరానికి దగ్గరగా దూసుకువస్తోన్న సైక్లోన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తుఫాన్ సైరన్‌తో ఏపీ వణుకుతోంది. అసని తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.., తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో తీరప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ సమీపిస్తుండటంతో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు అసని ఎఫెక్ట్‌తో విశాఖ సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఐతే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు..మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.
LIVE NEWS & UPDATES
-
అంధకారంలో కోనసీమ జిల్లా..
అసని తుపాను ప్రభావంతో కోనసీమ వ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కోనసీమ తీర ప్రాంతంలో తుపాను తీరం దాటనుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
-
రేపు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
అసని తుపాను ఎఫెక్ట్‌తో బుధవారం నాడు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రేపు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, యానాం లలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
-
-
కాకినాడ-విశాఖ తీరాలకు సమీపంగా దూసుకొస్తున్న అసని తుపాన్..
అసని తుపాన్ దూసుకొస్తుంది. కాకినాడ – విశాఖ తీరాలకు సమీపంగా తుపాన్ దూసుకొస్తుంది. కాకినాడకు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు నైరుతిగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బంగాళాఖాతంలో అసని తీవ్రత అధికంగా ఉంది.
-
అంచనాలను తారుమారు చేసిన అసని తీవ్రత..
అసని తీవ్ర తుఫాన్ వాతావరణ శాఖాధికారులు అంచనాలను కొంత మేర తారుమారు చేసింది. వాయువ్య దిశ నుండి పశ్చమ వాయువ్య౦గా దిశను మార్చుకొని మచిలీపట్నం వైపుకి వెల్లి వాయువ్యంగా ప్రయాణిస్తూ ఏపీ తీరానికి చేరువ అవుతోంది.
-
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 18004253077, కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెం :0884-2368100, పెద్దాపురం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెం 960366332
-
-
తీరంవైపు దూసుకొస్తున్న అసని తుఫాన్..
అసని తుఫాన్ తీరంవైపు దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ నైరుతి దిశగా ప్రయాణిస్తోంది. రాత్రికి విశాఖ, కాకినాడ మధ్య దిశను మార్చుకోనుంది. దీంతో కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10ని జారీ చేశారు. ఈ కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పాత భవంతుల్లో ఎవరూ ఉండకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
-
తుఫాన్ కారణంగా ఇంటర్ పరీక్ష వాయిదా..
తుఫాన్ కారణంగా బుధవారం ఏపీలో జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపటి పరీక్షను ఈ నెల 25వ నిర్వహించనున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
దిశ మార్చుకున్న అసని..
అసని తుఫాన్ దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రంలోగా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటే సూచనలు ఉన్నాయి. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
-
మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి..
తుఫాన్ తీరం దాటడంపై అనిశ్చితి కొనసాగుతోందని రానున్న 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని, ఎలాంటి ప్రాణ, అస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
-
అల్లకల్లోలంగా మారిన సముద్రం..
తుఫాన్ కారణంగా అల్లవరం మండలం ఓడలరేవులో సముంద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతుండడంతో ప్రాంతం కోతకు గురువుతోంది. కోనసీమ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసి ముద్దయింది. చేతుకొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
-
చెన్నైపై అసని తుఫాన్ ఎఫెక్ట్..
అసని తుఫాన్ కారణంగా చెన్నై శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. చెన్నై, తిరువళ్లూరు , జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షం నీరు చేరుకుంది. దీంతో తిరువళ్లూరు జిల్లాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి అధికారులు వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఇక సముద్ర తీరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి.మత్స్యకార గ్రామాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
-
తుఫాన్‌పై లేటెస్ట్ అప్‌డేట్..
అసని తుఫాన్‌పై విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద ప్రకటన చేశారు. తుఫాన్ కాకినాడకు అగ్నేయంగా 260 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోందని, దిశ మార్చుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అయితే తుఫాన్ తీరం దాటడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, తీరం దాటకుండానే బలహీన పడే అవకాశముందని ఆమె పేర్కొన్నారు.
-
వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా కీలక ప్రకటన..
తుఫాన్ నేపథ్యంలో వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలకు పడనున్నాయని ఆమె తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
-
రెండ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని గుంటూర్, కృష్ణా జిల్లాల్లో మంగళవారం (10-05-2022) అతిభారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఇక బుధవారం గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. అలాగే ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
-
తిరుమలలో ఉదయం నుంచి వర్షం..
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
-
విశాఖలో దంచికొడుతోన్న వర్షం..
తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం దంచికొడుతోంది. ఉదయం ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
-
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు గంటకు 40 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళ, బుధ వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
-
పలు విమానాలను రద్దు చేసిన అధికారులు..
తుపాను కారణంగా ముందు జాగ్రత్త చర్యగా విశాఖ నుంచి నడుస్తున్న 23 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్ ఏషియా దిల్లీ-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలను కూడా రద్దయ్యాయి. ముంబయి-రాయిపూర్-విశాఖ, దిల్లీ-విశాఖ ఎయిరిండియా విమాన సర్వీసులను రద్దు చేశారు.
-
ఉప్పాడ తీరంపై అసని ప్రభావం.. గ్రామాలపై ఎగిసిపడుతున్న అలలు..
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై అసని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలపై అలలు ఎగసి పడుతున్నాయి. పలువురి ఇళ్లు కోతకు గురై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్ రోడ్డుపైకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. అలల తీవ్రతకు సోమవారం ఉప్పాడ తీరానికి భారీ బార్జి కొట్టుకొచ్చింది. అందులో సుమారు వంద లారీల భారీ మెటల్, జేసీబీలు ఉన్నాయి. కాకినాడ పోర్టులోకి వెళ్లలేని భారీ ఓడల వద్దకే బార్జీలో సరకు తీసుకెళ్లి లోడింగ్ చేస్తారు.
-
తుఫాన్ ఏ దిశలో కదులుతోందో చూడండి..
తుఫాన్ ఏ దిశలో కదులుతోంది?.. ఏ ప్రాంతంలో వర్షలు పడే ఛాన్స్ ఉంది. బలహీన పడితే ఎక్కడ పడొచ్చు..? సముద్రంలోనా.. సముద్ర తీరంలోనా అనే వివరాలను తాజాగా వాతావరణ శాఖ అందించింది. ఆ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
The SCS Asani lay centered at 0530 hours IST of today near latitude 14.8°N and longitude 84.0°E, 300 km SE of Kakinada, 330 km SSE of Visakhapatnam, 510 km SSW of Gopalpur and 590 km SSW of Puri. It is likely to weaken gradually into a CS during next 24 hours. pic.twitter.com/2FFXEm797f
— India Meteorological Department (@Indiametdept) May 10, 2022
-
WATCH: విశాఖ-ఒడిశా తీరం వెంబడి బలమైన గాలులు..
అసని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.
విశాఖ తీరంలోని అలలను ఇక్కడ చూడండి..
#WATCH Odisha | Stormy waters on the shores of Puri beach amid rough sea conditions and gusty winds due to #CycloneAsani pic.twitter.com/zLQ5zrUpjw
— ANI (@ANI) May 10, 2022
-
WATCH: విశాఖ తీరంలో ఎగిసిపడుతున్న అలలు..
విశాఖపట్నంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
#WATCH Andhra Pradesh | Visuals from Visakhapatnam coast as rough sea conditions increase with strong winds due to #CycloneAsani pic.twitter.com/MAZd7LMFs2
— ANI (@ANI) May 10, 2022
-
ఈ రాత్రికి బలహీనపడే ఛాన్స్..
తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని.. మంగళవారం రాత్రికి తుపాను సముద్రంలో బలహీనపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇవాళ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించవచ్చునని అంచనా వేస్తున్నారు. అసని తుఫాన్ విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీ దూరంలో ఉంది. అసని తుఫాను 10 మే 2022 రాత్రికి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. అసని హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
-
శ్రీకాకుళం జిల్లాపై అసని ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్
అసని తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్. తీర ప్రాంతతో పాటు వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసాం. తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండే విధంగా గస్తీ ఏర్పాటు చేశారు. జిల్లాలో రక్షిత చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలాకి మండల కేంద్రంలో ఒక వ్యక్తి చెట్టు కొమ్మ పడి మృతి చెందిన విషయం పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు తుఫాన్ సెంటర్లలో ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ఎటువంటి విపత్తు వచ్చినా జిల్లా ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారు.
-
సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన రద్దు..
ముంచుకొస్తున్న అసని తుఫాన్ కారణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటన రద్దైంది. ఈ నెల 11న( బుధవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా భృతి కార్యక్రమం జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పదివేల మంది కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే.. తుఫాన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అదే రోజు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ డ్రిల్లింగ్ సమయంలో స్థానికంగా నష్టపోయిన వారికి పరిహారాలు సుమారు 110 కోట్ల మేర చెల్లించడం జరగాల్సి ఉండగా ఈ కార్యక్రమం కూడా వాయిదా వేశారు.
-
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుడు.. చాకచాక్యంగా కాపాడిన రెస్క్యూ సిబ్బంది
అసని ఎఫెక్ట్‌తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే సముద్రంలో చిక్కుకుపోయిన ఓ మత్స్యకారుడ్ని రెస్క్యూ సిబ్బంది చాకచాక్యంగా కాపాడారు. స్తానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో మత్స్యకారుడ్ని ఓడ్డుకి చేర్చారు.
-
కర్నూలు జిల్లాలో భారీగా పంట నష్టం
అసని తుఫాన్ గాలులకు కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో కూడా బొప్పాయి తోట నేలకూలింది. దీంతో ఎనిమిది లక్షల వరకు నష్టం జరిగింది. ఆదుకోవాలని రైతు హుసేన్ పీరా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
-
కర్నూలు జిల్లాలో నేలకొరిగిన బొప్పాయి తోట..
అసని తుఫాన్ ప్రభావం కర్నూలు జిల్లాపై కూడా కనిపిస్తోంది. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఈదురు గాలులకు బొప్పాయి పంట నేలకొరిగింది. దీంతో పది లక్షల ఆస్తి నష్టం వచ్చినట్లుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
అసని తుఫాన్ అలజడి.. పశ్చిమ గోదావరి జిల్లాలో కూలిన భారీ వృక్షం..
అసని తుఫాన్ అలజడి మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.., తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో తీరప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం కనిపిస్తోంది. తణుకులో వేగంగా వీస్తున్న గాలులకు భారీ వృక్షం కూలి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపై పడింది.
-
ఈ జిల్లాలకు రెయిన్ ఎల్లో అలర్ట్
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు
-
విశాఖకు విమానాల రాకపోకలు రద్దు- ఎయిర్ ఏషియా
అసని తీవ్ర తుపాను కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో తాగా వెల్లడించింది. ఎయిర్ ఏషియాకు చెందిన ఢిల్లీ- విశాఖ, బెంగళూరు- విశాఖ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన ముంబయి- రాయపూర్- విశాఖ, ఢిల్లీ- విశాఖ విమానాలు రద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.
-
వాతావరణ శాఖ మరో హెచ్చరిక..
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. అసని తుఫాను మే 10 రాత్రికి వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ , ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో, తుఫాను ఉత్తర-ఈశాన్య దిశగా మారి ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
The Severe CS ‘Asani’ over Westcentral and adjoining southwest BoB moved west-northwestwards and lay centered at 2330 hours IST of yesterday over westcentral and adjoining southwest BoB 330 km southeast of Kakinada (Andhra Pradesh), 350 km south-southeast of Visakhapatnam. pic.twitter.com/CSapgUpsVO
— India Meteorological Department (@Indiametdept) May 9, 2022
-
తుపాను కారణంగా.
తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో ఏపీ తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు గంటకు 40 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.
-
డేంజర్ బెల్స్ మోగిస్తున్న అసని తుఫాన్
అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరానికి దగ్గరగా దూసుకువస్తోన్న సైక్లోన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తుఫాన్ సైరన్‌తో ఏపీ వణుకుతోంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
-
అసని తుఫాను కారణంగా రాష్ట్రంలోని..
అసని తుఫాను కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఏపీలో కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఎక్కడికక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
-
మళ్లీ ఉత్తర-ఈశాన్య దిశలో మారి తుఫాను..
‘అసాని’ తుపాను తన భయంకరమైన రూపాన్ని చూపుతూ ప్రజలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. తీరం వద్దకు చేరుకున్నప్పుడు ఇది మళ్లీ ఉత్తర-ఈశాన్య దిశలో మారి తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కార్యాలయం ( IMD ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ అసాని ‘ తూర్పు తీరం వైపు కదులుతున్నందున దాని ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 120 కి.మీ వేగంతో బలమైన గాలులతో పాటు భారీ వర్షం కూడా కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అసని తుఫాను ఈ రాత్రికి ఉత్తర ఆంధ్ర, ఒడిశా తీరాలకు చేరుకునే సమయానికి తుఫానుగా మారే అవకాశం ఉంది.
-
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు – వాతావరణ శాఖ
మరోవైపు అసని ఎఫెక్ట్‌తో విశాఖ సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఐతే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.
-
సముద్రంలో అలజడి..
ఇప్పటికే తీర ప్రాంతంలో అసని అలజడి సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. బలమైన గాలులు, అలల ఉధృతికి జేసీబీ, కంకర క్రషింగ్‌తో కూడిన ఓ ఐరన్ పంటు కొట్టుకొచ్చింది. దీంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఐతే అది ONGC వర్క్‌కు చెందిన పంటుగా అనుమానిస్తున్నారు.
-
ఉత్తరాంధ్రపై అసాని ఎఫెక్ట్.. విశాఖ కలెక్టరెట్‌లో టోల్ ప్రీ నెంబర్..
ఉత్తరాంధ్రపై అసాని తుపాన్ ప్రభావం.. పలుచోట్ల ఈదురు గాలలుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల దాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం.. అసాని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. విశాఖ కలెక్టరెట్ లో టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.
Published On - May 10,2022 7:13 AM