కరోనా విలయతాండవం…ఢిల్లీలో తాత్కాలిక ఆస్పత్రులుగా స్టార్ హోటళ్లు
Covid-19 News: దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. శ్మశాన వాటికల దగ్గరకు భారీ సంఖ్యలో మృతదేహాలు చేరుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. శ్మశాన వాటికల దగ్గరకు భారీ సంఖ్యలో మృతదేహాలు చేరుతున్నాయి. శ్మశానవాటికల దగ్గర ఈ స్థాయిలో మృతదేహాలను మునుపెన్నడూ చేరలేదని ఢిల్లీలోని ఓ శ్మశాన వాటిక దగ్గర పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. వీరి వ్యాఖ్యలు దేశ రాజధానిలో కరోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది. దిల్లీ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా మేరకు…24 గం.ల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 17,282 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణకాగా…104 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఆ రాష్ట్రంలో 50,736 యాక్టివ్ కేసులున్నాయి.
దిల్లీలో 24 గం.ల వ్యవధిలో మొత్తం 1,08,534 కోవిడ్ టెస్ట్‌లు చేపట్టగా…వీటిలో ఏకంగా 15.92 శాతం మేర పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ రేటు నమోదుకావడం ఇదే తొలిసారిగా అధికారులు చెబుతున్నారు. చివరగా నవంబరు 15న 15.33 శాతం పాజిటివ్ రేటు నమోదుకావడమే అత్యధికంగా ఉంటూ వచ్చింది.
రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్స్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రముఖ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోవడంతో…ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ బెడ్ కావాలంటే గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంటోంది. పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేవని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య పెరిగి బెడ్స్ కోసం మరింత డిమాండ్ నెలకొనే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని 15 హోటళ్లను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. 5 స్టార్ హోటళ్లలో ఒక రోజు బెడ్ ఛార్జీలను రూ.5 వేలు, 3-4 స్టార్ హోటళ్లలో రూ.4 వేలుగా నిర్ణయించారు. ఆ మేరకు అదనంగా 3000 బెడ్స్‌ను కోవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్ప లక్షణాలతో వచ్చే కోవిడ్ రోగులను ఇక్కడ అడ్మిట్ చేసుకుని చికిత్స కల్పిస్తారు. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ హోటళ్లను కాంట్రాక్టుకు తీసుకుని తాత్కాలిక ఆస్పత్రులుగా నిర్వహిస్తాయి.
క్రౌన్ ప్లాజా, ఐటీసీ వెల్కమ్, రాడిస్సన్ బ్లూ, సూర్య తదితర 5 స్టార్ హోటళ్లను ఇలా కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. అలాగే పలు బాన్‌క్వెట్ హాల్స్, ఓ స్కూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. వీటి ద్వారా 1,100 కోవిడ్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అటు కోవిడ్ ఉధృతి తీవ్రంకావడంతో ముంబైలోని పలు 5 స్టార్ హోటళ్లను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా అదనపు బెడ్స్‌ను కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి… కోరలు చాస్తోన్న కరోనా, ఒక్కరోజులోనే దేశంలో రెండు లక్షల కేసులు
కరోనా విజృంభణ.. జీహెచ్ఎంసీ, ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు.. మొత్తం ఎన్ని నమోదయ్యాయంటే..?