PM Modi: చదువుకున్న ముస్లిం యువకులను కలవండి.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నాయకులకు దిశానిర్దేశం
పార్లమెంట్ ఎన్నికలకు 400 రోజులు మాత్రమే ఉంది. గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచేలా ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు.

పార్లమెంట్ ఎన్నికలకు 400 రోజుల డెడ్‌లైన్ మాత్రమే ఉంది. విజయం కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 18-25 ఏళ్ల ఉన్న యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ముస్లిం వర్గాలతో పాటు అన్ని వర్గాలకు చేరువకావాలన్నారు. బీజేపీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని , సామాజిక ఉద్యమమని అన్నారు మోదీ. భారత్‌కు స్వర్ణయుగం రాబోతోందని , అభివృద్ది కోసం కేడర్ కృషి చేయాలని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలతో మమేకమై, మనతో అనుసంధానం కావాలి. సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆఫీస్ బేరర్లకు సూచించారు.
పార్టీ నాయకులు ఓట్ల కోసం ఆందోళన చెందకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో సున్నితత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. ఓట్ల గురించి చింతించకుండా బోహ్రా, పస్మాండ ముస్లింలు, సిక్కు, క్రైస్తవ వర్గాలతో సహా మైనారిటీ కమ్యూనిటీలోని వృత్తిపరమైన, విద్యావంతులైన వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రధాని మోదీ నాయకులను కోరారు. ఎందుకంటే బీజేపీ ఓట్ల గురించి మాత్రమే కాదు.. దేశాన్ని, సమాజాన్ని మార్చే పనిలో ఉందని గుర్తు చేశారు. వర్శిటీ, చర్చికి వెళ్లడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
దేశంలోని 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువత ఓటర్లకు పూర్తి సేవ చేయడంతో పాటు సుపరిపాలనకు.. చెడు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయాలని ప్రధాని మోదీ పార్టీ నాయకులకు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో అవినీతి, అక్రమాలు ఎలా జరిగాయో, అధ్వాన్నంగా పాలన సాగిస్తోందని.. ఆ దుష్పరిపాలన శకం నుంచి బీజేపీ ఎలా దేశాన్ని బయటకి తీసుకొచ్చి సుపరిపాలన వైపు తీసుకువెళ్లిందో యువత దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రతిపక్షాన్ని తాను ఎప్పుడూ బలహీనంగా భావించనని.. అయితే ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలన్నారు.




బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని ప్రకటించారు. జేపీ నడ్డా నేతృత్వం లోనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు అమిత్‌షా. జూన్ 2024 వరకు నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగుతారని తెలిపారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషించారని అన్నారు అమిత్‌షా. లక్షా 30 వేల బూత్‌లెవెల్ కమిటీలను నడ్డా నిర్మించారని అన్నారు.
తెలుగు రాష్ట్రాలపై కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక చర్చ జరిగింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం