Rahul Gandhi: రాహుల్ యాత్ర 2.0 అందుకోసమేనా? అనుకున్నది సాధ్యపడేనా?
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పటికీ 'విదేశీ మహిళ' అస్త్రం సోనియాను ప్రధాని పీఠంపై కూర్చోనీయకుండా చేసింది. రాహుల్ గాంధీకి అప్పటికి రాజకీయానుభవం లేకపోయింది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అటు ఆయన తల్లి సోనియా నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు కోరుకుంటున్నారు.

ప్రధానిగా నరేంద్ర మోదీ రోజురోజుకూ పెంచుకుంటున్న ఇమేజ్, క్రేజ్ ఒకవైపు.. సంస్థాగతంగా నానాటికీ బలోపేతమవుతూ హిందీ రాష్ట్రాలను కంచుకోటగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోవైపు.. 139 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్న ప్రత్యర్థులు. సంస్థాగతంగా బలంగా కనిపిస్తున్న బీజేపీకి బ్రేకులు వేసేందుకు సుమారు 30 పార్టీలతో ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) కొంతవరకు సత్ఫలితాలు సాధించేలా కనిపిస్తున్నప్పటికీ.. ప్రధాని అభ్యర్థిగా కూటమి నుంచి ఏ ఒక్కరినీ ముందే ప్రకటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కూటమి 4వ సమావేశంలో మల్లికార్జున ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించినప్పటికీ.. అధికారికంగా కాంగ్రెస్ నుంచే సమ్మతి కనిపించలేదు. గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని కాదని ఆ పార్టీ నేతలు మరొకరిని ప్రధాని పీఠంపై ఊహించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పటికీ ‘విదేశీ మహిళ’ అస్త్రం సోనియాను ప్రధాని పీఠంపై కూర్చోనీయకుండా చేసింది. రాహుల్ గాంధీకి అప్పటికి రాజకీయానుభవం లేకపోయింది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అటు ఆయన తల్లి సోనియా నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు కోరుకుంటున్నారు.
కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి – బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు నేతలు తాము ప్రధాని పదవికి రేసులో ఉన్నామంటూ పరోక్షంగా చాటుకుంటున్నప్పటికీ.. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ను కాదని ప్రధాని పదవి అందుకునే ఆస్కారం మరెవరికీ లేదన్న విషయం వారికి కూడా తెలుసు. అయితే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మిత్రపక్షాలు అంగీకరించడం లేదనడానికి కూటమి 4వ సమావేశంలో మమత బెనర్జీ ప్రతిపాదనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మిత్రపక్షాలతో పాటు యావద్దేశంలో రాహుల్ గాంధీని నరేంద్ర మోదీకి సమఉజ్జీ కలిగిన ప్రత్యర్థిగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు ప్రధాని పదవిని వరించే లక్షణాలు, అర్హతలు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. వాటిలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్ర ఒకటి. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు దేశంలోని దక్షిణ భాగం నుంచి ఉత్తరం వైపు సాగిన ఈ యాత్ర అనంతరం రాహుల్ గాంధీపై ఏర్పడ్డ అభిప్రాయంలో కొంత మార్పు కనిపించింది. అప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేసిన ప్రచారం కారణంగా రాహుల్ గాంధీపై ‘పప్పు’ అన్న ముద్ర బలంగా ఏర్పడింది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతను బహిర్గతం చేశాయన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఉన్నట్టుండి అదృశ్యమై విదేశాలకు వెళ్లిపోవడం వంటి చర్యలతో పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడని నేతగానూ ఆయనపై ముద్ర పడింది.
‘భారత్ జోడో’ యాత్ర అనంతరం ఆయనపై పడ్డ ముద్రలను కొంతవరకు చెరిపేసుకోగలిగారు. కాలినడకన సాగించిన యాత్రలో ఆయన దేశంలోని పరిస్థితులను స్వయంగా చూసి అవగతం చేసుకోగలిగారు. ఈ యాత్ర రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ విజయాలేవీ అందించకపోయినా.. రాహుల్ గాంధీ ఇమేజ్ పెంచడంలో మాత్రం దోహదపడింది. సరిగ్గా ఎన్నికలకు ముందు మరికొద్ది రోజుల్లో చేపట్టబోయే రాహుల్ గాంధీ యాత్ర 2.0 – ‘భారత్ న్యాయ్’ యాత్ర ద్వారా రాహుల్ ఇమేజిని మరింత పెంచి మోదీకి ధీటైన అభ్యర్థిగా తయారు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈసారి హైబ్రిడ్ మోడ్!
దేశానికి తూర్పు దిక్కున చిట్టచివర్లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ నగరం నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ్’ యాత్రను ప్రారంభించనున్నారు. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున తక్కువ సమయంలో యాత్రను పూర్తిచేయడం కోసం ఈసారి హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నారు. ‘భారత్ జోడో’ యాత్ర పూర్తిస్థాయిలో కాలినడకన సాగగా.. ఈ యాత్ర అక్కడక్కడా కాలినడకన, చాలా చోట్ల వాహనాల్లో సాగనుంది. మొత్తం 14 రాష్ట్రాల మీదుగా 6,200 కి.మీ దూరం రాహుల్ ప్రయాణం సాగించనున్నారు. మణిపూర్ నుంచి ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి చివరకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగియనుంది. ‘భారత్ న్యాయ్’ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు కాంగ్రెస్‌కు రాజకీయ జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు.
ప్రధాని అభ్యర్థిగా బలమైన ముద్ర వేసుకునేలా..
రాహుల్ గాంధీ పేరును ప్రధాని అభ్యర్థిగా విపక్ష కూటమిలోని ఏ పార్టీ కూడా ప్రతిపాదించడం లేదు. కేజ్రీవాల్ నుంచి మమతా బెనర్జీ వరకు రాహుల్ గాంధీ పేరుపై ఏకాభిప్రాయమే లేదు. పైగా తామూ రేసులో ఉన్నామంటూ అడపా దడపా ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థి బీజేపీతోనే కాదు, మిత్రపక్షాలతో సైతం తెలియని కనిపించని యుద్ధాన్ని చేయాల్సి వస్తోంది. ధీటైన ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని నిలబెట్టగలిగితే అంతా సర్దుకుంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. “మా వైపు పదేళ్ల పాలన అందించిన ప్రధాని మోదీ ఉన్నారు.. మీ వైపు ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పండి” అంటూ బీజేపీ నేతల నుంచి ఎదురయ్యే సవాళ్లకు సైతం సరైన జవాబు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. అందుకే రాహుల్ తన యాత్ర 2.0 ను ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. ముందు బీజేపీని ఓడించి తాము గెలుపొందడమే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రధాని ఎవరన్నది తేల్చుతామని కాంగ్రెస్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ.. పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చిత్రీకరిస్తూ బలోపేతం చేయడమే లక్ష్యంగా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.