కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందకు ఆ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం ఎల్లిగండ్ల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గోప్లపూర్ కలాన్ చేరుకుంటుంది. సాయంత్రానికి పాదయాత్ర మన్యంకొండ చేరుకుంటుంది. రాత్రికి ధర్మపూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. తన పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్రలో ఈరోజు రాహుల్ గాంధీతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) నాయకులు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, టీపీసీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రహదారి పక్కన ఉన్న పాఠశాల విద్యార్థులను పిలిచి వారితో కలిసి రాహుల్ గాంధీ కాసేపు నడిచారు.
సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు.భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో భాగంగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. పాదయాత్ర చేస్తున్న మార్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ.. రహదారి పక్కన ఉన్న వారిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా సాయంత్రం సమయంలో వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. మరోవైపు కేంద్రప్రభుత్వ విధానాలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో పాదయాత్ర సందర్భంగా టీఆర్ ఎస్ ప్రభుత్వంపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీ పాదయాత్రను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రానున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న వేళ హైదరాబాద్ రానున్న ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు రానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..