ఎన్నికల ఓటమికి అసలైన కారణాలు ఏంటి..? కాంగ్రెస్‌లో మొదలైన ఆంతర్మథనం..!

గత పదేళ్లలో జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పొందలేకపోయింది. ఒకట్రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టగలిగినప్పటికీ.. అక్కడ ప్రత్యర్థులపై వ్యతిరేకతే ఆ పార్టీని గెలిపించింది తప్ప ప్రజల్లో పెరిగిన ఆదరణ కాదన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఒకసారి అధికారం చేపట్టిన రాష్ట్రంలో వరుసగా మరోసారి గెలవలేకపోతోంది.

ఎన్నికల ఓటమికి అసలైన కారణాలు ఏంటి..? కాంగ్రెస్‌లో మొదలైన ఆంతర్మథనం..!
Mallikarjun Kharge and Rahul gandhi in CWC Meeting
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 30, 2024 | 12:10 PM

వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తమ ఓటమికి గల అసలు కారణాలను గుర్తించే ప్రయత్నం ప్రారంభించింది. ఇన్నేళ్లుగా ‘ఆత్మస్తుతి – పరనింద’ అన్న చందంగా తమ ఓటమికి ఇతరులనే కారణాలుగా నిందిస్తూ వచ్చిన ఆ పార్టీ తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో కొంతమేర ఆత్మపరిశీలన చేసుకుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలయ్యింది.  తమ లోపాలు, బలహీనతలను గుర్తించే స్థితికి చేరుకుంది.

గత పదేళ్లలో జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాదరణ పొందలేకపోయింది. ఒకట్రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టగలిగినప్పటికీ.. అక్కడ ప్రత్యర్థులపై వ్యతిరేకతే ఆ పార్టీని గెలిపించింది తప్ప ప్రజల్లో పెరిగిన ఆదరణ కాదన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఒకసారి అధికారం చేపట్టిన రాష్ట్రంలో వరుసగా మరోసారి గెలవలేకపోతోంది. ఆ పార్టీ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (BJP) మాత్రం ఐదేళ్ల పాలన తర్వాత సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ.. సానుకూల ఓటుతో వరుసగా రెండోసారి, మూడోసారి సైతం గెలుపొందుతూ దూసుకుపోతోంది. తాము గెలిచినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)పై కలగని అనుమానాలు, సందేహాలు.. ప్రత్యర్థి గెలిచినప్పుడు మాత్రమే వెలిబుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మహారాష్ట్ర ఓటమి అనంతరం మరోసారి ఆ రాగం అందుకుంది. ఈ విషయంలో ‘పరనింద’ వీడకపోయినా.. వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీలో నెలకొన్న లోపాలు, బలహీనతలు, సమస్యలను మాత్రం కొంతమేర గుర్తించగలిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రారంభోపన్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు.

ఐక్యత, క్రమశిక్షణ

కాంగ్రెస్ పార్టీ అంటేనే అనైక్యతకు మారుపేరుగా, క్రమశిక్షణారాహిత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకుంటారు. ఒక అంశంపై ఒక్కో నేత ఒక్కోలా స్పందిస్తుంటారు. పార్టీ వైఖరి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతలు వేరు కుంపట్లకు తెరలేపుతూ సొంత ప్రభుత్వాలను, తద్వారా పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించకుండా ధిక్కరిస్తూ అది తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కొలమానంగా చెబుతుంటారు. అదే భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఎన్ని విబేధాలున్నా, స్పర్థలున్నా సరే.. అత్యంత క్రమశిక్షణ పాటిస్తూ పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తుంటారు. ఖర్గే ప్రసంగంలో ఆయన ఈ రెండు అంశాల గురించే గట్టిగా నొక్కి చెప్పారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, సంస్థాగత లోపాలు, బలహీనతలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ఐక్యత లేకుండా పరస్పర వ్యతిరేక ప్రకటనలు పార్టీకి తీరని నష్టం కల్గిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఐక్యంగా పోరాడి, ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం మానేస్తే తప్ప, ప్రత్యర్థులపై పైచేయి ఎలా సాధించగలం అంటూ క్లాస్ తీసుకున్నారు. “మనం కఠినమైన క్రమశిక్షణను పాటించడం ముఖ్యం. ప్రతి సందర్భంలోనూ ఐక్యంగా ఉండాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది ఆయుధం. కలసికట్టుగా ఉంటేనే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం. పార్టీ బలంగానే ఉంటేనే మనం బలంగా ఉంటాం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అంటూ ఆయన హితబోధ చేశారు.

సంస్థాగత నిర్మాణం

130 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీకి విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టి, యువజన, రైతు, మహిళా, మైనారిటీ, ఓబీసీ.. ఇలా అనేక అనుబంధ సంస్థలు, విభాగాలతో పటిష్టమైన యంత్రాంగం ఉంది. కానీ బీజేపీతో పోల్చుకుంటే ఈ పార్టీలో కనిపించే స్పష్టమైన తేడా ఒక్కటే. ఏ పార్టీలోనైనా పదవులు, అధికారం కోసం కార్యకర్తలు పనిచేస్తుంటారు. అయితే బీజేపీలో వైవాహిక జీవితాలను సైతం త్యాగం చేస్తూ పూర్తిగా పార్టీకే అంకితమయ్యే నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందు పదవి, ఆ తర్వాతే ఏదైనా అన్న భావన ఎక్కువగా కనిపిస్తుంది. పదవి కోసం కీచులాటలు పీతల గంపను తలపిస్తాయి. నిస్వార్థంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారి సంఖ్య చాలా తక్కువ. అటు బీజేపీలో పోలింగ్ బూత్ స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణంతో దేశం కోసం, మతం కోసం అంటూ పనిచేసే కార్యకర్తల యంత్రాంగం ఉంటే.. ఇటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అదే కొరవడింది. ఖర్గే ప్రసంగంలో పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఓటర్ల జాబితా తయారు చేయడం నుంచి ఓట్ల లెక్కింపు వరకు అహర్నిశలు పనిచేసే కార్యకర్తల యంత్రాంగం అవసరమని ఆయన తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఈ యంత్రాంగం సరిగా లేదని, పార్టీ బలోపేతం కావాలంటే బూత్ స్థాయి నుంచే అది జరగాలని సూచించారు.

CWC Meeting

CWC Meeting

జాతీయ సమస్యలు సరే.. స్థానికాంశాలు గుర్తించండి

కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలనలో గుర్తించిన మరో లోపం స్థానిక సమస్యలు, అంశాలను గుర్తించలేకపోవడం. ఎన్నికల్లో ఓటర్లను అత్యధికంగా ప్రభావితం చేసేవి స్థానికాంశాలే. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విద్యాధికులు తప్ప సామాన్యులు పెద్దగా దృష్టి పెట్టరు. కానీ కాంగ్రెస్ అదానీ ముడుపులు – అమెరికాలో కేసు వంటి అంతర్జాతీయ అంశాలు, సామాన్యుడికి అర్థంకాని అంశాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే తాము ఓడిపోయినంత మాత్రాన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు సమస్యలు కాకుండా పోవని చెబుతూనే.. పార్టీ యంత్రాంగం స్థానిక సమస్యలను గుర్తించాలని సూచించారు. “మనం ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు ఈ దేశానికి మండుతున్న సమస్యలని చెప్పడంలో సందేహం లేదు. కుల గణన కూడా నేడు ఒక ముఖ్యమైన అంశం. రాజ్యాంగం, సామాజిక న్యాయం, సామరస్యం వంటి అంశాలు ప్రజల సమస్యలు. అయితే ఎన్నికల రాష్ట్రాలలో ముఖ్యమైన స్థానిక సమస్యలను మనం మరచిపోవాలని దీని అర్థం కాదు. స్థానిక సమస్యలను వివరంగా అర్థం చేసుకోవడం, వాటి చుట్టూ ఒక నిర్దిష్ట ప్రచార వ్యూహాన్ని రూపొందించడం కూడా చాలా ముఖ్యం” అంటూ మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. జాతీయ సమస్యలు, జాతీయ నాయకుల ప్రాతిపదికన మీరు ఎంతకాలం రాష్ట్రాల ఎన్నికలలో పోటీ చేస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు.

Cwc3

CWC

ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి

కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలనలో గుర్తించినవాటిలో ఇంకా చాలా అంశాలున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించాలన్నది అందులో ఒకటి. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక చివరి క్షణం వరకు జరుగుతూనే ఉంటుంది. ప్రత్యర్థులు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దిగి దూసుకెళ్తుంటే, నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇవి కూడా పార్టీ ఓటమికి కారణాలుగా అధిష్టానం భావిస్తోంది. పాత విధానాలకు స్వస్తి చెప్పి, ప్రత్యర్థుల కదలికలు, వ్యూహాలను అర్థం గమనిస్తూ సమయానుకూలంగా ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగాలని ఖర్గే సూచించారు. “దేశంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మణిపూర్ నుండి సంభాల్ వరకు చాలా తీవ్రమైన సమస్య ఉంది. బీజేపీ తన వైఫల్యాల నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా అనేక మతపరమైన సమస్యలను ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తోంది” అని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. “లోక్‌సభ ఎన్నికలలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించిన తర్వాత, శాసనసభ ఎన్నికలలో మనకు ఎదురుదెబ్బ తగిలింది. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఓటమిని చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అట్టడుగున ఉన్న బూత్ స్థాయి నుంచి, బ్లాక్, జిల్లా, రాష్ట్రం, ఏఐసీసీ వరకు కొత్త సంకల్పంతో కాలానుగుణంగా మార్పు తీసుకురావాలి. ప్రస్తుత సవాళ్లను అధిగమించి ముందుకు సాగాలి” అంటూ ఖర్గే ప్రసంగాన్ని ముగించారు.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?