Bharat Jodo Yatra: బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఫైర్..

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున తరలివస్తున్న కార్యకర్తల నడుమ..

Bharat Jodo Yatra: బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఫైర్..
Rahul Gandhi

Updated on: Oct 08, 2022 | 3:52 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున తరలివస్తున్న కార్యకర్తల నడుమ.. జనాలను పలుకరిస్తూ రాహుల్ గాంధీ ముందుకు కదులుతున్నారు. తుముకూరులో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. భారత్‌ జోడో యాత్రలో సీనియర్లు కూడా పాల్గొనడం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఈ పాదయాత్ర సందర్భంగా బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు రాహుల్‌ గాంధీ. దేశాన్ని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ విడదీస్తున్నాయని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశం పరిస్థితి దారుణంగా మారిందని, సామాన్య ప్రజలు బ్రతుకలేని పరిస్థితి నెలకొందన్నారు.

గుత్తాధిపత్యానికి వ్యతిరేకం..

రాజస్థాన్‌లో అదానీ సంస్థ పెట్టుబడులు పెట్టడంపై రాహుల్ గాంధీ స్పందించారు. పెట్టుబడులు పెట్టడంలో తప్పు లేదన్నారు. రూ. 60వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటే ఏ సీఎం వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. చట్టబద్దంగా వ్యాపారం చేస్తే ఫర్వాలేదని, కాని వ్యాపారంలో గుత్తాధిపత్యానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు రాహుల్‌ గాంధీ.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై స్పందన..

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు రాహుల్‌గాంధీ. మల్లిఖార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ ఇద్దరు కూడా ఎంతో అనుభవం ఉన్న నేతలని అన్నారు. వాళ్లిద్దరిలో ఎవరు గెలిచినా.. రిమోట్‌ కంట్రోల్‌గా పనిచేస్తారని అనడం అవమానించడమే అవుతుందని అన్నారు రాహుల్‌.

నాగ్‌పూర్‌లో బీజేపీ అధ్యక్ష ఎన్నికలు..

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే. తమ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నికలు నాగ్‌పూర్‌లో జరుగుతాయని విమర్శించారు. మోదీ, షా ఇద్దరూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని, కొందరిని ఐశ్వర్యవంతులుగా చేసే ఆలోచనతో వారు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే హైదరాబాద్‌ వచ్చారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో 9 వేలకు పైగా డెలిగేట్లు ఓట్లు వేస్తారని అన్నారు. తాను ఈ ప్రాంతపు బిడ్డనని ఖర్గే తెలిపారు. అధ్యక్ష పదవికీ పోటీ అన్నది తన వ్యక్తిగతం కాదని, అందరీ సూచనలు, మద్దతు మేరకే పోటీకి దిగానని ఖర్గే వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..