Coaching Centres: ఆ విద్యార్థులకు రూ.1.56 కోట్లు రిఫండ్‌ చేసిన కోచింగ్‌ సెంటర్లు.. NCH సీరియస్‌ వార్నింగ్

సివిల్స్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల కోసం లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్ధులకు పూర్తి ప్రయోజనాలు అందిచాలని, అలా చేయని పక్షంలో వారు చెల్లించిన ఫీజును రిఫండ్‌ చేయాలని జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH) ఆదేశించింది. ఈ మేరకు చర్యలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చింది..

Coaching Centres: ఆ విద్యార్థులకు రూ.1.56 కోట్లు రిఫండ్‌ చేసిన కోచింగ్‌ సెంటర్లు.. NCH సీరియస్‌ వార్నింగ్
National Consumer Helpline

Updated on: Feb 23, 2025 | 1:57 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌ తీసుకున్న కొందరు విద్యార్ధులు తమకు న్యాయంగా తిరిగి చెల్లించవల్సిన ఫీజును ఆయా కోచింగ్ సెంటర్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ చొరవతో  దాదాపు 600 మందికి పైగా విద్యార్థులకు సదరు కోచింగ్ సంస్థలు రూ.1.56 కోట్ల వరకు ఫీజును వాపసు చేశాయి. ఈ మేరకు శనివారం ఆ శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. అసలేం జరిగిందంటే..

సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ కోర్సులు ఇతర ప్రోగ్రామ్‌ల కోసం కోచింగ్ సెంటర్లలో చేరిన 700 విద్యార్థులకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్దేశించిన నిబంధనలు, షరతులను పాటించడంలేదు. ఇలా గతంలోనూ తాము చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేందుకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు నిరాకరించాయి. దీనిపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కు విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇక్కడ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ చొరవతో రిఫండ్‌ ప్రక్రియను సులభతరం చేసింది. ఈ శాఖ చర్యల వల్ల విద్యార్థులు పొందని సేవలు, ఆలస్యమైన తరగతులు, రద్దు చేసిన కోర్సులకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పరిహారం పొందడానికి సహాయం చేసింది. అక్రమ వ్యాపార పద్ధతుల వల్ల లాభాలు గడిస్తున్న కోచింగ్ సెంటర్ల ముక్కు పిండి పరిహారం అందేలా చేసింది.

నిర్ణయాత్మక దిశలో విద్యార్థుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి స్పష్టమైన, పారదర్శకమైన వాపసు విధానాలను తప్పనిసరి చేస్తూ, విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని అవలంబించాలని అన్ని కోచింగ్ కేంద్రాలను ఆదేశించింది. చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లను తిరస్కరిస్తే ఇకపై సహించబోమని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు సైతం వినియోగదారుల హక్కులను కాపాడాలని కోరింది. ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి, విద్యార్థులకు వారి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడానికి కూడా ఈ విభాగం పనిచేస్తుంది. న్యాయం కోసం విద్యార్థులు, ఆశావహులకు సాధికారత కల్పించడంలో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ కీలకమైన వనరుగా ఉపయోగపడుతుంది. గతంలో కూడా NCH రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.