డ్రాగన్ కంట్రీ మరో కుట్ర.!! సీరం, భారత్ బయోటెక్‌లను టార్గెట్ చేసిన చైనీస్ హ్యాకర్లు.!
Chinese Hackers Target Serum: చైనా దేశం మరో దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్న రెండు దిగ్గజ కంపెనీల ఐటీ వ్యవస్థలపై..
Chinese Hackers Target Serum: చైనా దేశం మరో దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్న రెండు దిగ్గజ కంపెనీల ఐటీ వ్యవస్థలపై చైనాకు చెందిన హ్యాకర్లు గురి పెట్టినట్లు సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ సైఫిర్మా తెలిపింది. వివిధ దేశాలకు చైనా, భారత్ కోవిడ్ వ్యాక్సిన్‌ను అధిక మోతాదులో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచంలో విక్రయించే వ్యాక్సిన్లలో 60 శాతానికి పైగా భారతదేశం ఉత్పత్తి చేస్తుందన్న విషయం విదితమే.
సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్‌మాన్ సాచ్స్ మద్దతు గల సైఫిర్మా అనే సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ, స్టోన్ పాండా అనే పిలువబడే చైనా హ్యాకింగ్ గ్రూప్ ఎపిటి 10, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు సంబంధించిన ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్‌వేర్లలోని మూలాలను మాల్‌వేర్‌ని జొప్పించడం ద్వారా తెలుసుకుందని సదరు సంస్థ వెల్లడించింది.
”సంస్థలకు సంబంధించిన పూర్తి డేటాను స్వాధీనం చేసుకుని.. ఆయా భారతీయ ఔషధ సంస్థల పోటీ ప్రయోజనాన్ని పొందటమే చైనీస్ హ్యాకర్ల ప్రధాన లక్ష్యం అని సైఫిర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేష్ అన్నారు. అనేక దేశాలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న ఎస్‌ఐఐని ఎపిటి 10 క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. త్వరలోనే ఈ సంస్థ పెద్ద మొత్తంలో నోవావాక్స్ షాట్‌లను ప్రారంభించనున్న నేపథ్యంలో.. వారికి ఇదే మెయిన్ టార్గెట్ అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే “సీరం ఇన్స్టిట్యూట్ విషయంలో, వారు పలు బలహీనమైన వెబ్ సర్వర్లను కనుగొన్నారు. అవి ఖచ్చితంగా హాని కలిగించే వెబ్ సర్వర్లని కనిపెట్టినట్లు” రితేష్ హ్యాకర్లను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కాగా, చైనీస్ హ్యాకర్లు పెద్ద కుట్రకు ప్రణాళికను రచిస్తున్నారని తెలిపారు.