జడ్జినే ప్రలోభపెట్టారట ! ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి మూడేళ్ళ జైలుశిక్ష! అయితే !
అవినీతి కేసులో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని దోషిగా ప్యారిస్ కోర్టు ప్రకటించింది. లోగడ ఓ జడ్జిని ప్రలోభ పెట్ట జూశారని, కేసు విచారణను ప్రభావితం చేయజూశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి....
అవినీతి కేసులో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని దోషిగా ప్యారిస్ కోర్టు ప్రకటించింది. లోగడ ఓ జడ్జిని ప్రలోభ పెట్ట జూశారని, కేసు విచారణను ప్రభావితం చేయజూశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆయనకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే రెండేళ్ల శిక్షను సస్పెన్షన్ లో ఉంచింది. 2007 నుంచి 2012 వరకు ఫ్రెంచ్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ కన్సర్వేటివ్ లలో ఆయనకు ఇంకా పలుకుబడి ఉంది. 2007 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓ సంస్థ నుంచి అక్రమంగా సొమ్ము అందుకున్నానన్న ఆరోపణల నేపథ్యంలో తనపై పెట్టిన ఎంక్వయిరీ కి సంబంధించి రహస్య సమాచారాన్ని ఆయన ఓ జడ్జి నుంచి కోరాడట. ఆ సమాచారమిస్తే నీకు మొరాకోలో ఓ పెద్ద హోదా గల పోస్టు లభించేలా చూస్తానని ప్రలోభ పెట్టాడట. సర్కోజీకి, ఆయన లాయర్ కి మధ్య జరిగిన ఓ సంభాషణలో ప్రాసిక్యూటర్లకు ఈ సమాచారం తెలిసింది.
అయితే తానేమీ తప్పు చేయలేదని సర్కోజీ అంటున్నారు. తన వ్యవహారాలపై కావాలనే, తనను కేసులో ఇరికించాలనే నిఘా పెట్టిన ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ల కుట్రే ఇదని ఆయన అన్నారు. కాగా కోర్టు రూలింగ్ పై అప్పీలు చేసుకునేందుకు ఆయనకు 10 రోజుల వ్యవధి ఉంది. ఇలా అవినీతి ఆరోపణలకు గురైనవారిలో ఈయన రెండో మాజీ అధ్యక్షుడు. లోగడ దివంగత మాజీ నేత జాక్వెస్ షిరాక్ కూడా ఇలా అభియోగాలకు గురయ్యారు. కాగా నికోలస్ సర్కోజీ అవినీతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎక్కడ చదవండి:
నిరుడుగప్పిన నిప్పులా మారిన భారత్-చైనా సరిహద్దు వివాదం.. బలగాలు వెనక్కు తగ్గినా.. మారని పరిస్థితి