Char Dham Yatra 2022: చార్ ధామ్ యాత్రలో విషాదం.. ఆరు రోజుల్లో 16 మంది భక్తుల మృతి.. కారణం ఏంటంటే..?
ప్రతికూల వాతవారణం కారణంగా చార్ ధామ్ యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. యాత్ర ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 16 మంది యాత్రికులు చనిపోవడం ఆందోళన రేకిత్తిస్తోంది.
16 Dead in Char Dham Yatra: అక్షయ తృతియ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో ఈ నెల 3 నుంచి చార్దామ్యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్ఆలయాల సందర్శనను చార్ ధామ్ యాత్రగా పేర్కొంటారు. ఈ యాత్రలో భాగంగా గడ్డకట్టే చలిలో ఏటా వేలాది మంది భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. అయితే.. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 16 మంది యాత్రికులు మృతి చెందడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వీరంతా గుండెపోటుతో, ఇతర అనారోగ్య కారణాలతో మరణించినట్టు ప్రాథమిక సమాచారం. యాత్రీకుల మరణాల వెనుక కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో యాత్రకు ముందు ప్రభుత్వం భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్‌కు పూర్వం వలె కాకుండా.. హెల్త్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను తీసుకురావాలని రాష్ట్రం యాత్రికులను కోరలేదని.. అంతేకాకుండా యాత్రికుల సంఖ్యపై కూడా పరిమితి విధించలేదని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంటున్నారు.
అయితే.. యాత్రికుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు కావున చెక్‌పోస్టు వద్ద రద్దీ మరీ ఎక్కువగా ఉందని, దీంతో భక్తులు ఆరోగ్య పరీక్షలను దాటవేస్తున్నారని ఉత్తరకాశీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎస్. చౌహాన్ పేర్కొన్నారు. పరీక్షల నివేదికలు వస్తే.. ఆరోగ్యం సరిగా లేని వారికి చికిత్స అందించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ మరణాలపై ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రి ధన్ సింగ్ రావత్ మాట్లాడుతూ.. ఇప్పటికే నాలుగు ధామ్‌లలో సాధ్యమైనంత మేరకు ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేసి.. వైద్య సిబ్బందిని మోహరించామని తెలిపారు. అయితే.. త్వరలో యాత్రికులు ఆరోగ్య ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని కోరనున్నట్లు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: