
మహారాష్ట్రాలోని సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి బీభత్సం సృష్టించింది. తునికాకు కోసం వచ్చిన కూలీలపై విరుచుకుపడి నలుగురిఇన అంతం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి పులి తిరుగుతోన్నట్టు తెలుస్తోంది. అయితే స్థానికంగా నివాసం ఉండే గ్రామస్తులు బీడీలు తయారు చేసే ఆకులు సేకరించేందుకు అడవీలోకి వెళ్లారు. అయితే వారు ఆకులు సేకరిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో మాటువేసిన పెద్దపులి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది.కూలీలపై దాడి చేసి నలుగురిని అక్కడికక్కడే చంపేసింది. మరికొందరిని తీవ్రంగా గాయపరిచింది.
పులి దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఎనిమిది మంది ప్రాణభయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
ఇక పులి ఎక్కడి నుంచి వచ్చింది. ఏఏ పరిసరాల్లో తిరుగుతుంది అనే దానిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక జనాలు వణికిపోతున్నారు. అటవీ ప్రాంత సరిహద్దుల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.వీలైనంత త్వరగా పులిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.