ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌ను జనవరి 25కు వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది. ఈడీ అధికారులు అభిషేక్, విజయ్ నాయర్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, శరత్ చంద్రారెడ్డిని కోర్టు హాలులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో జనవరి 6న ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆధారాలను చార్జిషీట్‌లో పొందుపరిచింది.
అలాగే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో ప్రస్తావించింది. తీహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రు, శరత్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా, అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్ తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్ర కంపెనీలపై ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది.
శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాడీవేడీ వాదనలు కొనసాగాయి. సౌత్ గ్రూప్ కంపెనీలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట, కవితలు ఉన్నారని.. ఆ గ్రూపు నుంచి వందకోట్ల ముడుపులు విజయ్ నాయర్ ద్వారా అమ్ ఆద్మీ పార్టీకి అందాయన్నారు ఈడీ తరఫు న్యాయవాది. నిపుణుల కమిటీ ప్రభుత్వమే పంపిణీ వ్యవస్థలో ఉండాలని సూచించినా.. ఆ సిఫార్సుల్ని బేఖాతరు చేసిన తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇక స్కామ్‌తో సంబంధం ఉన్న వాళ్లంతా ఒకే సమయంలో ఫోన్లను ధ్వంసం చేయడం కుట్రకు నిదర్శనమన్నారు. మరోవైపు వందకోట్ల రూపాయలు, లంచం అంటూ పదే పదే ఈడీ చెబుతున్న లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు శరత్ చంద్రారెడ్డి తరఫు న్యాయవాది. చందన్ రెడ్డి పేరు పదే పదే ప్రస్తావించారు. కానీ కేసులో అతన్ని ఎక్కడా సాక్షిగా కూడా చూపలేదని కోర్టుకు వివరించారాయన.
శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల తరఫున వాదనలు విన్న సుప్రీంకోర్ట్.. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం