రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంటిపై దాడి చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు 17 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సదరు రిటైర్డ్ ఇండియన్ రైల్వే అధికారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన ప్రమోద్ కుమార్ జెనా అనే వ్యక్తి నవంబర్ 2022లో భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో అతను ఆదాయానికి మించి భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో జనవరి 4న సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో రూ. 1.57 కోట్ల నగదు, 17 కిలోల బంగారం, రూ. 2.5 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాంక్ పత్రాలు, కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతరుల పేరిట భువనేశ్వర్, కటక్, జగత్సింగ్‌పుర్‌లలో కూడా జెనాకు ఆస్తులున్నట్లు గుర్తించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ మాజీ అధికారి అయిన ప్రమోద్ కుమార్ జెనా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపి మరిన్ని వివరాలను తెలియజేస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.