Caste Census: జనగణనకు కేంద్రం కసరత్తు షురూ.. మరి కులగణన కూడా ఉంటుందా?
బ్రిటీష్ పాలనలో ఉన్న సమయం నుంచి ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. మొట్టమొదటిసారి 1881లో జనగణన జరగగా, చివరిసారిగా 2011లో జరిగింది. నిజానికి 2010లోనే జనాభా లెక్కలు సేకరించి, వాటిని క్రోడీకరించి 2011లో ప్రచురించారు. ఈసారి కూడా 2020లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సినప్పటికీ కోవిడ్-19 అనంతర పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదు.
మన దేశంలో ప్రతి పదేళ్లకు ఓసారి జరిగే జనాభా లెక్కల సేకరణ (జనగణన) ఈసారి ఆలస్యమైంది. 2021లో జరగాల్సిన ఈ మహాక్రతువు త్వరలో ప్రారంభం కానుంది. జనగణన ద్వారా ఆ పదేళ్ల కాలంలో దేశంలో పెరిగిన జనాభా ఎంత అన్నది తెలుసుకోవడంతో పాటు స్త్రీ, పురుష నిష్పత్తి వంటి అనేక విషయాలు తెలుస్తాయి. తద్వారా సామాజిక భద్రత, ప్రజా సంక్షేమ పథకాలను ఎలా, ఏ మేరకు అమలు చేయాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిన జనగణన ఆలస్యానికి కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్ వంటి ప్రపంచవ్యాప్త పరిణామాలే కారణమయ్యాయి. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఇది మరింత ఆలస్యమైందని చెప్పవచ్చు. ఇప్పుడు అన్నింటినీ దాటుకుని జనాభా లెక్కల సేకరణకు అడుగులు పడుతున్నాయి. అయితే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో జనతాదళ్ (యునైటెడ్) వంటి కొన్ని అధికార కూటమి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కులగణనకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉద్దేశపూర్వకంగా జాప్యం
బ్రిటీష్ పాలనలో ఉన్న సమయం నుంచి ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. మొట్టమొదటిసారి 1881లో జనగణన జరగగా, చివరిసారిగా 2011లో జరిగింది. నిజానికి 2010లోనే జనాభా లెక్కలు సేకరించి, వాటిని క్రోడీకరించి 2011లో ప్రచురించారు. ఈసారి కూడా 2020లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సినప్పటికీ కోవిడ్-19 అనంతర పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో అమలు చేసిన పథకాలను 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకునే అమలు చేస్తూ వచ్చాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో సీట్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో పార్లమెంటులోనూ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. పెరిగిన సంఖ్యకు తగ్గట్టుగా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కూడా పూర్తయి, ప్రారంభమైంది. కానీ నియోజకవర్గాల పెంపే ఇంకా జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి లోక్‌సభ సీట్ల సంఖ్య 522గా ఉండగా, 1973లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఆ సంఖ్యను 542కు పెంచింది. ఇందుకు 1971 నాటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించింది. ఆ తర్వాత సిక్కిం భారతదేశంలో కలవడంతో ఒక సీటు అదనంగా కలిసి ఆ సంఖ్య 543కు చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ నియోజకవర్గాల పెంపు జరగనే లేదు. 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 తర్వాత జరిగిన జనాభా లెక్కల సేకరణ ద్వారా వచ్చిన గణాంకాలను ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంపు, రాష్ట్రాలవారిగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2031లో ముద్రించే జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని పార్లమెంటు, అసెంబ్లీల సీట్ల సంఖ్యను పెంచాలి. అది 2034 సార్వత్రిక ఎన్నికల నాటికి గానీ ఇది సాధ్యం కాదు. దీన్ని 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే సాధ్యం చేయాలంటే.. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను జాప్యం చేస్తూ 2026 నాటికి జరపడమే. లేదంటే మళ్లీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన సమయంలో కూడా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను పార్లమెంట్, అసెంబ్లీలలో సీట్ల సంఖ్యను పెంచిన తర్వాతనే అమలు చేస్తామంటూ మెలిక పెట్టారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నా.. జనాభా లెక్కల సేకరణ, ఆ గణాంకాల ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ కసరత్తు జరగాల్సి ఉంటుంది. ప్రస్తుత జాప్యం ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తుందని భావించవచ్చు.
జనగణనకు రూ. 12వేల కోట్ల ఖర్చు
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన భారతదేశంలో జనగణన కసరత్తు చేపట్టడం అంత తేలికైన వ్యవహారం కాదు. భారీ ఖర్చుతో పాటు ప్రయాస కూడా ఉంటుంది. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) ముద్రణ కోసం రూ. 12,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గతంలో కాగితాల మీద సేకరించిన గణాంకాలను క్రోడీకరించేందుకు చాలా సమయం పట్టేది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ మోడ్‌లో జరగనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ రూపొందించనుంది. ఇందులో దేశ ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి జనాభా లెక్కలు సేకరించేవారు. ఈసారి అందుకు భిన్నంగా ప్రజలు డిజిటల్ విధానంలో పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివరాల సేకరణలో భాగంగా కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, జెండర్ వంటి వివరాలతో మొత్తం 31 ప్రశ్నలు ఉండనున్నాయి. అయితే అందులో ‘కులం’ ఉంటుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.
అయితే కులగణన పట్ల ఇంతకాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కులగణన అంశం అత్యంత కీలకంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, ఆ మేరకు రిజర్వేషన్లను కూడా పెంచుతామని ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రకటన బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసింది. రాజకీయంగా తమకు నష్టం కల్గిస్తున్న ఈ అంశంపై చివరకు కమలనాథులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.