బిఎస్ఎన్ఎల్ నిర్వాకాలు
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా తయారైంది. వినియోగదారులకు సరైన.. సౌకర్యవంతమైన సేవలు అందించలేకపోవడంతో దేశంలో బీఎస్ఎన్ఎల్ వినియోగాన్ని బాగా తగ్గించేశారు జనం
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా తయారైంది. వినియోగదారులకు సరైన.. సౌకర్యవంతమైన సేవలు అందించలేకపోవడంతో దేశంలో బీఎస్ఎన్ఎల్ వినియోగాన్ని బాగా తగ్గించేశారు జనం. దీనికి తోడు ఉద్యోగులకు భారీ స్థాయిలో వీఆర్‌ఎస్ ఇవ్వడం.. ఆస్తులను మోనటైజ్ చేయడం సహా అనేక చర్యలతో దాదాపు కుదేలైంది ఈ సంస్థ. దీంతో ఇప్పుడు మరోమారు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందని సమాచారం. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ మరోవైపు కోరుతోంది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు భారీగా పెరిగిపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమైందని చెబుతున్నారు. ఇక.. నష్టాల్లో ఉన్నబీఎస్ఎన్ఎల్ ను ఆదుకోడానికి 2019 అక్టోబర్‌లో కేంద్రం 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమోదించిన సంగతి తెలిసిందే.