INDIA alliance: ఇక రాహుల్ పని అంతేనా.. ప్రధాని అభ్యర్థిగా పనికిరారా? I.N.D.I కూటమి తేల్చేసిందా?
రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా I.N.D.I కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడుపడని వ్యవహారం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచుగా చేసే...

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ విపక్ష కూటమి ఓ బాంబు పేల్చింది. కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చింది. ‘దళిత ప్రధాని’ అంశాన్ని లెవనెత్తడం ద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైడ్ చేసి, గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని ‘షాక్’కి గురిచేసింది. రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా I.N.D.I కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడుపడని వ్యవహారం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచుగా చేసే కుటుంబ వారసత్వ రాజకీయాల విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ వదులుకోవడమే చేటు చేసిందా అన్న అంతర్మథనం ఇప్పుడు మొదలైంది. తమ చెప్పుచేతల్లో ఉంటాడనుకుని మల్లికార్జున ఖర్గేను ఏరికోరి తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చోబెడితే ఏకంగా ప్రధాని పీఠంపైనే కన్నేసి తెరవెనుక మంత్రాంగం నడిపారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
నాడు విదేశీ అస్త్రం – నేడు స్వపక్షంలో విపక్షం..
స్వతంత్ర భారత మొట్టమొటది ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు వరుసగా కొనసాగిన నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగాయి. ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను సుదీర్ఘకాలం పాటు నిర్వహించినప్పటికీ.. ప్రధాని పీఠంపై కూర్చోలేదు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేసిన ‘విదేశీ మహిళ’ ఆరోపణల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే పదేళ్ల యూపీఏ పాలనలో పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధాని కానీ పెత్తనం మొత్తం సోనియాదే అన్న విమర్శలూ లేకపోలేదు. పార్టీ కీలక నిర్ణయాలే కాదు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు సైతం 10 జన్‌పథ్ (సోనియా గాంధీ నివాసం)లోనే జరిగాయని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. వాటి సంగతెలా ఉన్నా సోనియా గాంధీ వదులుకున్న పీఠాన్ని రాహుల్ గాంధీకి కట్టబెట్టాల్సిందే అన్న పట్టుదల పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కనిపిస్తుంది. తదుపరి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న ప్రశ్న కంటే ముందే రాహుల్ గాంధీకి ప్రధాని పీఠాన్ని దూరం చేసే ప్రయత్నాలు మొదలైనట్టు I.N.D.I కూటమి 4వ సమావేశంలో జరిగిన చర్చ తేటతెల్లం చేస్తోంది.
‘ఖర్గే’యే ముద్దు – రాహుల్ మాకొద్దు..
ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)గా ఆవిర్భివించక ముందు నుంచే కూటమిలోని కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చాయి. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. రాజకీయ పరిణితిని ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలు రాహుల్ గాంధీపై ఉన్నాయి. దీనికి తోడు ప్రత్యర్థి పార్టీ బీజేపీ గతంలో చేసిన ‘పప్పు’ ప్రచారం కూడా ఎలాగూ ఉంది. రాహుల్ గాంధీ నాన్-సీరియస్ పొలిటీషియన్ అంటూ స్వపక్షంలోనే విమర్శలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఎన్ని అభ్యంతరాలున్నా.. ఇన్నాళ్లుగా మరో ప్రత్యామ్నాయం చూపలేకపోవడంతో మిన్నకుండిపోయారు. మమత బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు అడపా దడపా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నామంటూ హల్‌చల్ చేసినా.. వీళ్లలో ఏ ఒక్కరినీ మిగతా అందరూ అంగీకరించే పరిస్థితి లేదు. పైగా వీళ్ల పార్టీలకు ఒకట్రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా పట్టు, ఆదరణ లేవు.
ఈ పరిస్థితుల్లో కూటమిలో పెద్దన్నగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మూలాలు కల్గిన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రధాని అభ్యర్థిని అంగీకరించక తప్పని స్థితి నెలకొంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెసేతర I.N.D.I కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలు మమత బెనర్జీ కేవలం ‘దళిత ప్రధాని’ అని మాత్రమే సూచించారు తప్ప ‘ఖర్గే’ పేరును నేరుగా ప్రతిపాదించలేదని చెబుతున్నా.. కూటమి సమావేశం అనంతరం పలువురు నేతలు మరోలా స్పందించారు. ఎండీఎంకే అధినేత వైకో మాట్లాడుతూ మమత బెనర్జీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై కూటమిలో ఏ ఒక్క పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. మొత్తంగా మాకు “రాహుల్ వద్దు – ఖర్గేయే ముద్దు” అని విపక్ష కూటమిలో మెజారిటీ అభిప్రాయంగా ఇప్పుడు చలామణి అవుతోంది.
తెరవెనుక ఖర్గే మంత్రాంగం.?
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు గాంధీ-నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, నమ్మినబంటులా ఉన్న మల్లికార్జున ఖర్గే.. ఆ తర్వాత నుంచి తన రాజకీయ చతురతను ప్రదర్శించడం ప్రారంభించారు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించేలా తెరవెనుక మంత్రాంగం ఆయనే నడిపారన్న కథనాలు కూడా ఉన్నాయి. అధిష్టానం ఆదేశాలకు జీ-హుజూర్ అంటూనే.. తనకంటూ సొంత కోటరీని, వర్గాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ‘షాడో’ సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒకదశలో తాను కూడా సీఎం పదవి రేసులో ఉన్నానంటూ ప్రియాంక్ స్వయంగా ప్రకటించారు.
అక్కడ ఇప్పటికే సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య – డీకే శివకుమార్ మధ్య పెద్ద అగాధం ఉంది. ఇప్పుడు ప్రియాంక్ వారిద్దరినీ కాదని థర్డ్ పవర్ సెంటర్‌గా మారడం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరహా మంత్రాగం కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితంగా కాలేదు, ఇప్పుడు ‘దళిత ప్రధాని కార్డు’ను ప్రయోగించడం ద్వారా తన స్థాయికి ప్రధాని అభ్యర్థిత్వం వరకు పెంచుకోగలిగారు.
‘దళిత కార్డ్’ నేపథ్యంలో గాంధీ-నెహ్రూ కుటుంబం కూడా “కాదు – వద్దు” అని చెప్పలేని ఇరకాటంలో పడిపోయింది. ఖర్గేను వద్దంటే దళిత ప్రధానిని వద్దన్న సందేశం వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే “బీసీ ప్రధాని”గా నరేంద్ర మోదీ దేశవ్యాప్త బీసీ జనాభాను ఆకట్టుకుంటున్న తరుణంలో ‘దళిత ప్రధాని’ అంశం విషయంలో ఏమాత్రం తేడా చేసినా మొదటికే మోసం. మొత్తంగా.. ఖర్గే అటు పార్టీలోనే కాదు ప్రధాని అభ్యర్థిత్వం విషయంలోనూ “రాహుల్ ఔట్ – ఖర్గే ఇన్” వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..