AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

Indian Seafarer Death Mystery: ఈ ఏడాది మే నెలలో వెనిజులాలో గుండెపోటుతో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ మృతి వ్యవహారంలో మిస్టరీ మరింత ముదురుతోంది. దక్షిణ అమెరికాలోని వెనిజులా నుంచి ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత.. పోస్టుమార్టం నిర్వహించగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి..

Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్
Indian Seafarer Death Mystery
Srilakshmi C
|

Updated on: Jul 01, 2026 | 7:31 PM

Share

వెనెజులాలో మృతి చెందిన భారత నావికుడు రాకేష్‌ బాడీలో కొన్ని పార్టులు కనబడకుండా పోయాయి. మెదడు, గుండె, ఊపిరితిత్తులు సహా అనేక అంతర్గత అవయవాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత నావికుల సంఘాల సమాఖ్య (FSUI) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. వెనిజులా అధికారులు ఎలాంటి పోస్టుమార్టం నివేదిక, మరణానికి సంబంధించిన వివరాలు ఇవ్వకుండానే రాకేష్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామానికి పంపినట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది.

కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేయాలని కోరగా.. భారత్‌లో నిర్వహించిన అధికారిక పోస్టుమార్టం నివేదికలో ఈ భయానక నిజాలు వెలుగుచూశాయి. మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం, అగ్న్యాశయం, కడుపు, ప్రేగులు, థైరాయిడ్, హయోయిడ్ ఎముక, లారింక్స్, ట్రాకియా వంటి అన్ని అవయవాలు కనిపించలేదని FSUI తన పోస్టులో పేర్కొంది. అలాగే మృతదేహంపై ముందుగానే శస్త్రచికిత్స చేసినట్లు ఎన్నో కుట్లు ఉన్నాయని తెలిపింది. మెడ నుంచి పొత్తికడుపు వరకు 22 కుట్లు, ఒక చెవి నుంచి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయని వెల్లడించింది. దాదాపు నెల రోజుల పాటు మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్‌లో ఉంచినట్లు పేర్కొంది. అన్ని అవయవాలు లేకపోవడంతో మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయినట్లు భారత్‌లో చేసిన పోస్టుమార్టంలో నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితి భారతీయ కార్మికుల భద్రత, విదేశీ అధికారుల బాధ్యత, పారదర్శకతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని FSUI పేర్కొంది. ఇది అసలు ఆమోదయోగ్యం కాదు. నావికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారులపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి. వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలి. పూర్తి పోస్టుమార్టం నివేదిక, మరణ పరిస్థితుల వివరాలు వెల్లడించాలి. బాధిత కుటుంబానికి న్యాయం, తగిన పరిహారం అందించాలని FSUI డిమాండ్ చేసింది.

కుటుంబ సభ్యులు ఏమన్నారు?

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా లగ్డా బజార్ టోలా గ్రామానికి చెందిన రాకేష్ చౌహాన్ (33).. 2025 నవంబరులో ఒక వాణిజ్య నౌకలో సిబ్బందిగా పనిచేయడానికి వెనిజులాకు వెళ్లాడు. ఎక్స్‌ఫినిటీ (Xfinity) అనే సంస్థ అతడిని ఆ ఉద్యోగానికి పంపింది. మొదట కంపెనీ అధికారులు ఫోన్‌లో రాకేష్ నౌకపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని, చికిత్స పొందుతున్నాడని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అతను బతికే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం అతను మరణించినట్లు సమాచారం ఇచ్చారు. మరణ కారణం గురించి అడిగితే, పడిపోవడంతో వచ్చిన తీవ్ర గాయాల వల్లే మరణించాడని కంపెనీ తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతదేహాన్ని వారంలోపే అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చినా, దాదాపు నెల రోజుల తర్వాత జూన్ 4న మాత్రమే డియోరియాకు చేరిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తమకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని, మొదట ఒక పోస్టుమార్టం నిర్వహించారని.. ఆ నివేదిక తమకు అందివ్వలేదని అన్నారు. కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ పోస్టుమార్టం చేయగా శరీరంలోని అవయవాలు లేవని తేలింది. దీంతో మరణ కారణాన్ని కూడా నిర్ధారించలేకపోయారు. ఇందుకు కారణమైన కంపెనీపై తగిన చర్యలు తీసుకుని పూర్తి దర్యాప్తు చేయాలని రాకేష్ తండ్రి రామ్ దేవ్ చౌహాన్ డిమాండ్ చేశారు.

పోస్టుమార్టం నివేదికలో ఏం ఉంది..?

డియోరియాలో పోలీసులు సమక్షంలో వైద్యుల బృందం మృతదేహాన్ని పరిశీలించింది. ఇప్పటికే పోస్టుమార్టం చేసినట్లు కనిపిస్తోందని, అధికారిక ఆదేశాలు లేకుండా మరోసారి పరీక్ష నిర్వహించలేమని వైద్యులు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం మెడ నుంచి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 60 సెంటీమీటర్ల పొడవైన కోతకు 22 కుట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు 20 సెంటీమీటర్ల పొడవుతో 21 కుట్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నీలిరంగులోకి మారి, కొన్ని చోట్ల చర్మం ఊడిపోయినట్లు పేర్కొన్నారు. 2026 మే 7 నుంచి జూన్ 5 వరకు డీప్ ఫ్రీజర్‌లో ఉంచినట్లు నివేదికలో పేర్కొన్నారు. పోస్టుమార్టం సమయంలో మెదడు, మెదడుకు సంబంధించిన పొరలు, రక్తనాళాలు, థైరాయిడ్, హయోయిడ్ ఎముక, లారింక్స్, ట్రాకియా, గుండె, రెండు ఊపిరితిత్తులు, పెరికార్డియం, ప్రధాన రక్తనాళాలు, కడుపు, ప్రేగులు, పిత్తాశయం, ప్లీహం, మూత్రపిండాలు తదితర అవయవాలన్నీ లేనట్లు వైద్యులు నమోదు చేశారు.

అవయవాలను ఎందుకు తొలగిస్తారు?

సాధారణంగా పోస్టుమార్టం సమయంలో గుండె, పిత్తాశయం, మూత్రపిండాలు వంటి కొన్ని అవయవాలను పరీక్షల కోసం తొలగించడం జరుగుతుంది. అయితే ఈ కేసులో వెనిజులా అధికారులు గానీ, రాకేష్ పనిచేసిన సంస్థ గానీ మరణానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు, పోస్టుమార్టం నివేదికను అందించకపోవడం వివాదానికి దారితీసింది. అంతేకాకుండా వెనిజులా అధికారులు మరణానికి సంబంధించిన పరిస్థితులు ఏమిటన్న దానిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. దీంతో రాకేష్ చౌహాన్ మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు మిస్టరీగా మారాయి.

Follow Us