Border Tension: ఓవైపు పాక్ డ్రోన్లు.. ఇంకోవైపు డ్రాగన్ మిలిటరీ.. సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్
ఓవైపు పాకిస్తాన్ డ్రోన్లు.. ఇంకోవైపు డ్రాగన్ కంట్రీ తరలిస్తున్న సైనిక బలగాలు.. వెరసి మనదేశానికి మరోసారి సరిహద్దు టెన్షన్ మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. మన దేశానికి వాయువ్య ప్రాంతంలో వున్న పాకిస్తాన్ వైపు నుంచి...
Border Tension again for India: ఓవైపు పాకిస్తాన్ డ్రోన్లు.. ఇంకోవైపు డ్రాగన్ కంట్రీ తరలిస్తున్న సైనిక బలగాలు.. వెరసి మనదేశానికి మరోసారి సరిహద్దు టెన్షన్ మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. మన దేశానికి వాయువ్య ప్రాంతంలో వున్న పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా బాంబులను ప్రయోగిస్తున్న టెర్రరిస్టులు, వారికి సాయమందిస్తున్న పాకిస్తాన్ ఓ వైపు నుంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంటే.. ఇంకోవైపు నుంచి చైనా తమ మిలిటరీ బలగాలను పెద్ద ఎత్తున లద్దాక్ సరిహద్దులో మోహరిస్తోంది. గత సంవత్సరం చైనా తన బలగాలతో భారత భూభాగాన్ని ఆక్రమించడంతో దాదాపు మూడు నెలల పాటు యుద్ద వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం పలు రకాల దౌత్య విధానాలను, మిలిటరీ ఒత్తిళ్ళను క్రియేట్ చేయడంతో సుదీర్ఘ కాలం తర్వాత చైనా బలగాలు సరిహద్దు నుంచి తప్పుకున్నాయి. దాంతో సరిహద్దులో కాస్త ప్రశాంతత నెలకొందని భావిస్తున్న తరుణంలోనే మరోసారి చైనా బలగాల మోహరింపును ప్రారంభించిందన్న కథనాలు మొదలయ్యాయి.
భారత్ ఏ విషయంలో ఆందోళన చెందుతుందో ఇప్పుడదే జరిగింది. ఉగ్రవాదులు కంచెలు దాటకుండానే.. విరుచుకు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఉగ్రమూకలు డ్రోన్ల సాయంతో దాడులకు తెగబడుతున్నారు. గత 4 రోజులుగా ఉగ్రమూకలు విధ్వంసానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జమ్మూకాశ్మీర్లో డ్రోన్ల కలకలం ఆగడం లేదు. జమ్ములోని సైనిక శిబిరాలకు సమీపంలో తాజాగా మరోమారు డ్రోన్ లు కనిపించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సైన్యానికి సంబంధించి కీలకమైన స్థావరాలను టార్గెట్ చేస్తూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. మొదట జూన్ 27 ఆదివారం తెల్లవారుజామున జమ్మూ విమానాశ్రయంలోని ఐఎఎఫ్ స్టేషన్‌లో డ్రోన్ల సాయంతో రెండు బాంబులతో దాడికి యత్నించారు. డ్రోన్ల సహాయంతో వైమానిక దళం పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడులలో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆ తర్వాత రత్నుచక్-కలుచక్ స్టేషన్ వద్ద రెండు డ్రోన్లు తిరగడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. 22 రౌండ్లు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్లు అక్కడినుండి వెళ్ళిపోయాయి. ఆ డ్రోన్ల కోసం గాలింపు చేపట్టారు. తిరిగి 29 మంగళవారం కూడా సుమ్మవాన్ సైనిక ప్రాంతంతో సహా జమ్మూలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్లు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. దీంతో గస్తీని ముమ్మరం చేసింది. కాగా, జమ్ము సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించాయి.
ఈ డ్రోన్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత్ ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏకి అప్పగించింది. కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఎన్ఐఏకి దీనిపై దర్యాప్తు అప్పజెప్పిన మరుసటిరోజే మరోమారు డ్రోన్లు తిరగడం మిలటరీ వర్గాలను అప్రమత్తం చేసింది. జమ్మూలోని వాయుసేన విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత.. పలు ప్రాంతాల్లో వాటి సంచారం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వాయుసేన స్థావరంపై దాడి చేసింది ఉగ్రవాదులేనని అనుమానిస్తోంది ఎన్ఐఏ. పాక్ నుంచి దేశంలోకి డ్రోన్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తోంది. ఈ డ్రోన్ల మిస్టరీని ఛేదించడానికి సైన్యంతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు రంగంలోకి దిగారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని భావించి బోర్డర్ లో సైనిక గస్తీని మరింత ముమ్మరం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇప్పటివరకు నాలుగు రోజులుగా జమ్మూ నగరంలోని మిలిటరీ స్థావరాల వద్ద ఏడు డ్రోన్లు లభించటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇక ఈ డ్రోన్ల వెనుక పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్టు తెలుస్తుంది. డ్రోన్ల సంచారంపై ఇప్పటికే ఐక్య రాజ్య సమితి వేదికగా మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహాత్మక ప్రదేశాలపై, వాణిజ్యపరమైన ఆస్తులపై ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడుతుండటం మీద ప్రపంచ దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని భారత్ కోరింది.
ఇంటర్నెట్, సోషల్‌మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తిని అరికట్టాల్సి ఉందని చెప్పింది. కొత్త పేమెంట్ విధానాలను అనుసరిస్తూ..ఉగ్రవాదులకు నిధుల చేరవేత వంటివి ఇప్పటికే పెను సవాళ్లు విసురుతున్నాయని తెలిపింది. తాజాగా డ్రోన్ల రూపంలో మరో ముప్పు ముంచుకొస్తున్నదని కేంద్ర హోంశాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది తెలిపారు. మరోవైపు జమ్ములో డ్రోన్ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29నే అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్‌తోపాటు జాతీయభద్రత సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే భద్రతా ముప్పులు, సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని వేగవంతంగా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇందులో భాగం కానున్నాయి. ముఖ్యంగా రక్షణ శాఖ, త్రివిధ దళాలు ఈ పాలసీ రూపకల్పన, అమలులో కీలకపాత్ర పోషించనున్నాయి. డ్రోన్ వంటి దాడులను ఎదుర్కొనేందుకు బలగాలకు అధునాతన ఆయుధ సామాగ్రిని సమకూర్చడంపైనా సమావేశంలో చర్చించారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని భావించి బోర్డర్ లో సైనిక గస్తీని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటివరకు నాలుగు రోజులుగా జమ్మూ నగరంలోని మిలిటరీ స్థావరాలు వద్ద ఏడు డ్రోన్లు లభించటం ఆందోళన కలిగిస్తున్న అంశం .ఇక ఈ డ్రోన్ల వెనుక పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇక మరోవైపు లద్దాక్ సరిహద్దులో డ్రాగన్ కదలికలు కూడా పెరిగినట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. గత సంవత్సరం సుదీర్ఘ కాలం పాటు యుద్ద వాతావరణానికి కారణమైన డ్రాగన్ కంట్రీ.. మళ్ళీ తన కోరలు చాస్తున్న సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ ఏకంగా 50 వేల మంది సైనికులను చైనా బోర్డర్ వైపు మళ్ళించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు అందుకున్న ఇండియన్ ఆర్మీ సన్నాహాలను వెంటనే పూర్తి చేసి.. సరిహద్దు వైపు బలగాలను తరలించడం మొదలు పెట్టినట్లు సమాచారం. ఇటువైపు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు, పాకిస్తానీ ఆర్మీ, మరోవైపు డ్రాగన్ కంట్రీ మిలిటరీ మోహరింపు నేపథ్యంలో మన దేశానికి మరోసారి సరిహద్దు టెన్షన్ మొదలైన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.