AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bombay High Court: మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు నిరాకరణ.. కీలక తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు

రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ (ప్రార్థనలు) చేసుకునేందకు అనుమతించాలని కోరిన జుమా మసీదు ట్రస్టుకు బాంబే హైకోర్టు బుధవారం అనుమతి నిరాకరించింది.

Bombay High Court: మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు నిరాకరణ.. కీలక తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు
Bombay High Court
Balaraju Goud
|

Updated on: Apr 14, 2021 | 6:00 PM

Share

High court on mass prayers: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరించింది. రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ (ప్రార్థనలు) చేసుకునేందకు అనుమతించాలని కోరిన జుమా మసీదు ట్రస్టుకు బాంబే హైకోర్టు బుధవారం అనుమతి నిరాకరించింది.

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ముంబైలోని ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను బోంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కొవిడ్-19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చిచెప్పింది. మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినప్పటికీ… పౌరుల ప్రాణ భద్రత అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.

పవిత్ర రంజాన్ మాసం దృష్ట్యా దక్షిణ ముంబైలోని తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్‌డీ ధనుక, జస్టిస్ వీజీ బిష్త్‌లతో కూడిన ధర్మాసనం… కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఆంక్షలు అత్యావశ్యకమని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. ‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి…’’ అని కోర్టు పేర్కొంది.

కాగా తమ మసీదు ఎకరం స్థలంలో విస్తరించి ఉందనీ.. ఒకేసారి 7 వేల మంది సమావేశమయ్యేందుకు సరిపోతుందని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో విడతకు కనీసం 50 మంది చొప్పున అయినా రంజాన్ సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ కోరింది. కొవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టుకు విన్నవించింది.

అయితే, పిటిషనర్ వాదనను అదనపు ప్రభుత్వ ప్లీడర్ జ్యోతి చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె కోర్టుకు నివేదించారు. ‘‘ ప్రతి మత విశ్వాసాలను గౌరవించాల్సిందేనని.. అయినప్పటికీ, ఏ మతానికి మేము మినహాయింపు ఇవ్వలేము. ప్రత్యేకించి ఈ 15 రోజుల్లో అది ఎట్టిపరిస్థితుల్లోనూ సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచింది. ఈ దశలో మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ప్రజలంతా సహకరించాలి..’’ అని చవాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్న విషయాన్ని కోర్టుకు నివేదించారు.

ప్రజలు తమ విశ్వాసాలను కొనసాగించడంపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. అయితే, వాటిని ప్రజలు తమ ఇళ్లవద్దనే చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం… ప్రస్తుతం కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమంటూ సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతంలో కూడా దేశంలోని అనేక కోర్టులు మతాలకు అతీతంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.

ఇదిలావుంటే, కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఏప్రిల్ 14 రాత్రి 8 గంటల నుండి మే 1 వరకు రాష్ట్రంలో ప్రజల కదలికలపై కర్ఫ్యూ లాంటి ఆంక్షలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 15 రోజుల వ్యవధిలో, అన్ని మత ప్రార్థనా స్థలాలు మూసివేయాలని పేర్కొంది. ప్రార్థనా స్థలంలో సేవలో నిమగ్నమైన సిబ్బందికి మాత్రమే తమ విధులను కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. బయటి సందర్శకులు, భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించింది. అలాగే, ప్రార్థనా స్థలాల సిబ్బంది అందరూ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం త్వరగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. “మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీని పరిశీలిస్తే, పిటిషనర్ మసీదు వద్ద ప్రార్థనలు చేయడానికి మేము అనుమతించలేము. రాష్ట్ర ప్రభుత్వ పరిమితి ఉత్తర్వు ప్రజా ప్రయోజనానికి, మహారాష్ట్ర వాసులందరి భద్రత కోసమే ”అని ధర్మాసనం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గతంలో బాంబే హైకోర్టు తోపాటు దేశంలోని అనేక ఇతర న్యాయస్థానాలు అనేక ఇతర మత సమాజాలకు అనుమతులను నిరాకరించాయని ధర్మాసనం ఈ అభ్యర్ధనను తిరస్కరించింది.

Read Also…  Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది