BJP- Rajya Sabha: దక్షిణాది నుంచి రాజ్య సభకు దిగ్గజాలు.. సౌత్‌పై స్పెషల్ ఫోకస్.. బీజేపీ లెక్క ఇదేనా?
BJP Focus on South States: మిషన్ సౌత్.. అప్పుడే స్టార్ట్ చేసేసింది బీజేపీ. అందులో భాగంగా.. నలుగురికి ఏకంగా రాజ్యసభ పదవులిచ్చింది.. ఇంతకీ ఈ పదవులు పొందిన వారెవరు? వారి ప్రత్యేకతలేంటి? దక్షిణాది నుంచి వారి ప్రాతినిథ్యమెంత? ఉత్తరాదిని సైతం వీరు చేసిన ప్రభావమెంత? ఆ లెక్కేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈస్ట్, వెస్ట్, నార్త్.. ఎటు చూసినా కమలమే. ఇక మిగిలింది సౌత్. ఇక్కడ కూడా లోటస్ వనం కాబోతోందనేది బీజేపీ టాక్. తెలుగు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతేస్తాం అంటున్నారు. పార్టీ జాతీయ సమావేశాల తర్వాత మంచి ఊపుమీదున్న కమలం పార్టీ.. టార్గెట్ సౌత్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రం తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసింది. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ , సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తునట్టు స్వయంగా ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
- సినీ, క్రీడా, ధార్మిక రంగ ప్రముఖులకు రాజ్యసభ నామినేటెడ్ పదవులు
- జాబితాలో దర్శక-రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా
- పరుగుల రాణి పీటీ ఉష, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే
సినీ, క్రీడా, ధార్మిక రంగాలకు చెందన నలుగురు ప్రముఖులను కేంద్రం రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసింది. నామినేటెడ్ కోటాలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ దర్శక-రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషతో పాటు ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేలను రాజ్యసభ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా నలుగురికీ విడివిడిగా అభినందించారు. క్రీడారంగంలో పీటీ ఉష సాధించిన విజయాలు ఎంతో ప్రశంసనీయమని, అలాగే ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తున్న ఆమె కృషి కూడా అంతే ప్రశంసనీయమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
സവിശേഷയായ പി ടി ഉഷ ജി ഓരോ ഇന്ത്യക്കാരനും പ്രചോദനമാണ്. സ്പോർട്സിലെ അവരുടെ നേട്ടങ്ങൾ പരക്കെ അറിയപ്പെടുന്നു. വളർന്നുവരുന്ന അത്ലറ്റുകൾക്ക് കഴിഞ്ഞ കുറേ വർഷങ്ങളായി മാർഗദർശനം നൽകുന്ന അവരുടെ പ്രവർത്തനവും ഒരുപോലെ പ്രശംസനീയമാണ്. pic.twitter.com/b89B7laVAy
— Narendra Modi (@narendramodi) July 6, 2022
ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రస్తావిస్తూ ఆయన సృజనాత్మక కళ ఎన్నో భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. ఆయన ఎదిగొచ్చిన నేపథ్యం, సాగించిన జీవన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కొన్ని తరాలను ఆయన సంగీతంతో అలరించారని ప్రశంసించారు.
தலைமுறைகளைக் கடந்து @ilaiyaraaja அவர்களின் அற்புத படைப்பாற்றல் மக்களை மகிழ்வித்து வருகிறது. அவரது இசைப் படைப்புகள் பல்வேறு உணர்வுகளை அழகாக வெளிப்படுத்துவன. pic.twitter.com/qgV1ZlK9lP
— Narendra Modi (@narendramodi) July 6, 2022
మరోవైపు ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే గురించి ప్రస్తావిస్తూ.. సామాజిక సేవలో ఆయన సేవ అమోఘమని కొనియాడారు. ధర్మస్థల ఆలయాన్ని సందర్శించే అవకాశం లభించినప్పుడు తాను స్వయంగా విద్య, సంస్కృతి, ఆరోగ్య రంగాల్లో వీరేంద్ర హెగ్గడే చేస్తున్న విశేష కృషిని చూశానని పేర్కొన్నారు. పార్లమెంటరీ కార్యాకలాపాలకు ఆయన మరింత వన్నె తెస్తారని అన్నారు. చివరగా దర్శక-రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ (ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి) గురించి ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా సృజనాత్మకతకు నిలయమైన సినీ రంగంలో ఉన్నారని, భారతదేశ ఘనమైన సంస్కృతీ-సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబించేలా ఆయన రచనలు చేశారని కొనియాడారు. ఈ నలుగురూ రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf
— Narendra Modi (@narendramodi) July 6, 2022
దక్షిణంపై గురి!
ఉపరాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురూ నాలుగు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దక్షిణాదివారే కావడం విశేషం. నాలుగు ప్రధాన భాషా సమూహాల నుంచి ఒక్కొక్కరిని బీజేపీ నాయకత్వం ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. పరుగుల రాణి పీటీ ఉష కేరళకు చెందినవారు (మలయాళీ) కాగా, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా తమిళనాడుకు చెందినవారు. వీరేంద్ర హెగ్గడే కర్నాటకకు చెందినవారు కాగా, విజయేంద్ర ప్రసాద్ తెలుగువారు. రాజ్యసభ నామినేటెడ్ పదవుల్లో వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారిని నియమిస్తుంటారు.
ఈ నలుగురి ఎంపిక చాలా వ్యూహాత్మకంగా జరిగినట్టుగా అర్థమవుతోంది. బీజేపీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కర్నాటకలో అధికారంలో ఉన్న కమలదళం, పక్కనే ఉన్న తెలంగాణపై దృష్టి కేంద్రీకరించినట్టు ఈమధ్య చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.
వీటితో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు, ఆయా భాషా సమూహాలను ఆకట్టుకునే క్రమంలో అందరికీ సుపరిచితులైన సినీ, క్రీడా, ధార్మిక రంగ ప్రముఖులను ఎంపిక చేసింది.
దక్షిణాది రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో బీజేపీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాది ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే అని తెలుస్తోంది.