ఏపీలో హిందువుల అణచివేత, జగన్ సర్కారుపై అమిత్ షాకు ఎంపీ లేఖ

కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం.. హిందువులపై మాత్రం అణచివేత వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

ఏపీలో హిందువుల అణచివేత, జగన్ సర్కారుపై అమిత్ షాకు ఎంపీ లేఖ
Follow us

|

Updated on: Sep 18, 2020 | 7:30 PM

కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం.. హిందువులపై మాత్రం అణచివేత వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన పలు అంశాలతో కూడిన లేఖను అమిత్ షాకు పంపారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఏడాదిలోనే 18 దేవాలయాలపై దాడుల ఘటనలు జరిగాయని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఏపీ ప్రజలనే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను కూడా గాయపరుస్తున్నాయన్నారు. హిందువుల సెంటిమెంట్లతో ముడిపడిన ఈ అంశాలపై దర్యాప్తుకు ఏపీ సర్కారు సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. ఈ ఘటనలను పరిగణనలోకి తీసుకోని ఏపీ సర్కారు చర్చిలపై రాళ్లు విసిరిన ఘటనపై మాత్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వ నిర్లిప్త ధోరణిని ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న 41 మంది హిందూ కార్యకర్తలపై మాత్రం చర్చిలపై రాళ్లు వేశారంటూ తప్పుడు కేసులు బనాయించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. హిందూ కార్యకర్తల అరెస్ట్ ని నిరసిస్తూ ఏపీ బీజేపీ నేతలు ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిన్నటి నుంచి గృహనిర్బంధంలోనే ఉంచారని తెలిపారు. ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఏపీలో చట్టం సరిగా అమలయ్యేలా చూడాలంటూ అమిత్ షాను కోరారు బీజేపీ ఎంపీ.