BJP National Executive Meeting 2022: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో జూలై 2 నుంచి రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ ప్రధాన దక్షిణాది రాష్ట్రంలో ఇటీవలి సంవత్సరాలలో బీజేపీ తన పునాదిని వేగంగా విస్తరించుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత దేశ రాజధాని వెలుపల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ భారత రాష్ట్రంలో బీజేపీకి ఇది మూడో సమావేశం. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అంతకుముందు 2015లో కర్ణాటక రాజధాని బెంగళూరులో, 2016లో కేరళలోని కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ఈ సమావేశం కీలకం కానుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రీయ సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు బీజేపీకి సవాలు విసిరేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సహా అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా కలిశారు.
రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. షా, నడ్డా వంటి పార్టీ సీనియర్ నేతలు కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో, సంస్థ పనిని, దేశవ్యాప్తంగా దాని విస్తరణను సమీక్షించారు. అలాగే పార్టీ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌ను తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఇలాంటి సమావేశాలలో సాధారణంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఆమోదించనున్నారు.