బెంగాల్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలు, నేడు అమిత్ షా, జేపీ నడ్డా చర్చలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ సమాయత్తమైంది. ఇందులో భాగంగా పార్టీ కోర్ గ్రూప్ బుధవారం సమావేశమవుతోంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ సమాయత్తమైంది. ఇందులో భాగంగా పార్టీ కోర్ గ్రూప్ బుధవారం సమావేశమవుతోంది. హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ ఎంపీ ముకుల్ రాయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బెంగాల్ తొలి, రెండో దశ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై ఈ మీటింగ్ లో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో బాటు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు బెంగాల్ లో నిర్వహించనున్న ర్యాలీలకు సంబందించి చేపట్టవలసిన చర్యలపై కూడా ఈ కోర్ మీటింగ్ లో చర్చిస్తామని దిలీప్ ఘోష్ తెలిపారు. మోదీ సుమారు 20 ర్యాలీల్లో, అమిత్ షా, నడ్డా ఒక్కొక్కరు 50 చొప్పున ర్యాలీల్లో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మార్చి 7 న కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ ర్యాలీలో మోదీ పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీకి సుమారు 10 లక్షలమందిని సమీకరించాలని పార్టీ యోచిస్తోంది. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఇంటింటి ప్రచారానికి దిగినట్టు సమాచారం. ఈ ర్యాలీల్లో మోదీ స్థానిక అంశాలను కూడా ప్రస్తావించేందుకు అనువుగా వీరు ప్రత్యేక సమాచారాన్ని ఆయనకు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో మొత్తం 42 సీట్లకు గాను 18 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటి బెంగాల్ లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ రాష్ట్రంలో సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఓడించి..ఇక్కడ కాషాయ సర్కార్ ని ఏర్పాటు చేయాలనీ పార్టీ తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో మొదట బెంగాల్ ఎన్నికలను మొత్తం 8 దశల్లో నిర్వహించాలన్న ఈసీ యోచనే ఈ రాష్ట్రానికి ఎంతగా ప్రాధాన్యమిస్తున్నారన్న విషయం అవగతమవుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ :
Gold Rate In Hyderabad Video: మహిళలకు శుభవార్త..మరింత తగ్గిన బంగారం ధర.