Bilkis Bano Case: బిల్కిస్‌ బానో కేసులో దోషులకు షాకిచ్చిన సుప్రీం.. ‘ఆదివారంలోగా లొంగిపోండి’

|

Jan 19, 2024 | 4:45 PM

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోయేందుకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు గడువు పొడిగించాలని కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం (గురువారం 19) కొట్టివేసింది. జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి జనవరి 21 వరకు గడువును పొడిగించేందుకు అనుమతించాలని కోరుతూ బిల్కిస్ బానో కేసులో..

Bilkis Bano Case: బిల్కిస్‌ బానో కేసులో దోషులకు షాకిచ్చిన సుప్రీం.. ఆదివారంలోగా లొంగిపోండి
Bilkis Bano Case
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 19: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోయేందుకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు గడువు పొడిగించాలని కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం (గురువారం 19) కొట్టివేసింది. జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి జనవరి 21 వరకు గడువును పొడిగించేందుకు అనుమతించాలని కోరుతూ బిల్కిస్ బానో కేసులో సామూహిక అత్యాచారం, హత్యలకు పాల్పడిన దోషులు దాఖలు చేసిన పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదని జస్టిస్‌ బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆదివారం నాటికి దోషులంతా లొంగిపోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.

11 మంది దోషుల్లో 10 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, రాబోయే పంట కాలం వంటి కారణాలను ఎత్తి చూపుతూ లొంగిపోయేందుకు మరింత సమయం కావాలని పిటిషన్లలో ఉటంకించారు. ఈ పిటిషన్లను విచారణకు అత్యవసరంగా జాబితా చేయడానికి ఉన్నత న్యాయస్థానం గురువారం అనుమతించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ భుయాన్‌లతో కూడిన ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి నుంచి అనుమతి పొందవలసిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ మేరకు దోషుల పిటిషన్లను ఈ రోజు విచారించిన ధర్మాసనం వారి అభ్యర్ధనను తోసిపుచ్చింది. మరో రెండు రోజుల్లో జైలు అధికారుల ముందు 11 మంది దోషులు లొంగిపోవాలని ఆదేశించింది.

కాగా 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. నాటి అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని ముష్కరులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా అయిన బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2022లో వీరికి గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేయడంతో.. అదే ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వారి విడుదల చెల్లదని స్పష్టం చేసింది. వారంతా రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరి 8న తీర్పు వెలువరించింది. లొంగిపోయేందుకు రెండు వారాలు గడువు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను తాజాగా విచారించిన అత్యున్నత ధర్మాసనం, వారి అభ్యర్ధనను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.