దండకారణ్యంలో రక్తపాతం… ఇంకా మావోల చెరలోనే జవాన్ రాకేశ్వర్ సింగ్.. మావోయిస్ట్ లేఖలో మర్మమేంటీ..?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మారణకాండ సృష్టించిన 3 రోజుల తర్వాత మావోయిస్ట్‌ల పేరిట ఓ లేఖ విడుదలైంది.

దండకారణ్యంలో రక్తపాతం... ఇంకా మావోల చెరలోనే జవాన్ రాకేశ్వర్ సింగ్.. మావోయిస్ట్ లేఖలో మర్మమేంటీ..?
Bijapur Encounter
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2021 | 8:45 AM

Maoist letter: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మారణకాండ సృష్టించిన 3 రోజుల తర్వాత మావోయిస్ట్‌ల పేరిట ఓ లేఖ విడుదలైంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ లేఖలో రాసి ఉంది. మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ను అప్పగిస్తామని దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరిట లేఖలో ప్రకటించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. చనిపోయినవారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ , కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా పేర్కొంది.

మావోయిస్టుల మెరుపు దాడిలో పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోపాటు మరణించిన మావోయిస్టుల చిత్రాలను కూడా విడుదల చేశారు. 23 మంది జవాన్లు మృతి చెందారనేది మావోయిస్ట్‌ల వాదన. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందే జీరగూడెంలో మాడ్వి సుక్కా అనే గ్రామస్థున్ని పోలీసులు పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది.

Maoists Killed In Bijapur Encounter

Maoists Killed In Bijapur Encounter

సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో వివిధ గ్రామాలపై దాడి జరిపేందుకు బస్తర్‌లోని ఐజీ పి. సుందర్‌రాజ్‌ నేతృత్వంలో ఏప్రిల్ 3న 2,000 మంది జవాన్లు ఈ ప్రాంతానికి తరలి వచ్చారని, అందుకే తాము ఎదురుదాడికి దిగామని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వంలో 2020 ఆగస్టులో దిల్లీలో జరిగిన సమావేశంలో ‘ఆపరేషన్‌ ప్రహార్‌- ఆపరేషన్‌ సమాధాన్‌’ ప్రణాళిక రూపొందించినట్టు మావోయిస్ట్‌ల ఆరోపిస్తున్నారు.

Maoist Letter On Bijapur Encounter

Maoist Letter On Bijapur Encounter

Maoist Letter On Bijapur Encounter 1

Maoist Letter On Bijapur Encounter 1

ఈ ప్రణాళిక అమల్లో భాగంగా 150మందికి పైగా గ్రామీణ ప్రజల్ని భద్రతా బలగాలు చంపాయన్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు కొందరు ప్రజలు ఉన్నారన్నారు. ఫాసిస్టు ‘సమాధాన్‌- ప్రహార్‌’కు పీఎల్‌జీఏ ప్రతీకారం తీర్చుకుందని, వీటన్నింటికీ మోదీ, అమిత్‌షా బాధ్యత వహించాలన్నది వికల్ప్‌ లేఖ సారాంశం.

ఎదురు కాల్పుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు మావోయిస్ట్‌ల సానుభూతి తెలిపారు. వారితో మాకు శత్రుత్వం లేదు. ప్రభుత్వాల అన్యాయమైన యుద్ధంలో బలిపశువులు కావద్దని వారికి విజ్ఞప్తి చేశారు మావోయిస్ట్‌లు. అంబానీ, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు.. వనరుల దోపిడీ చేస్తున్నట్టు ఆరోపించారు. దానికి మావోయిస్టు పార్టీ ఆటంకంగా మారడంతో సైనిక దాడులు చేయిస్తున్నారని మావోయిస్ట్‌లు ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని అధికారాలు ప్రజలకే అనే ‘జనతన’ సర్కార్ల ఏర్పాటే ప్రత్యామ్నాయం’ అని పేర్కొన్నారు.

మరోవైపు మావోయిస్టుల చెరలో చిక్కిన ‘కోబ్రా’ కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఆచూకీ కోసం భద్రతా బలగాలు దృష్టి సారించాయి. స్థానికుల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తూనే.. పోలీసు ఇన్‌ఫార్మర్లనూ రంగంలో దించాయి. తమ జవాన్ ఒకరు ఇప్పటికీ కనిపించడం లేదని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే, ఆ వార్తలను వెరిఫై చేసుకుంటున్నట్లు డీజీ కుల్దీప్ సింగ్ అన్నారు.

తాజా ఎన్‌కౌంటర్‌‌తో పాటు గతంలో అనేక ఘటనల వెనుక ‘పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ’ బెటాలియన్‌ నంబర్‌-1 అగ్రనేత హిడ్మాది కీలక పాత్ర. హిడ్మా చుట్టూ ఎప్పుడూ నాలుగు అంచెల్లో భద్రత వ్యవస్థ ఉంటుంది. అతని వద్దకు చేరుకోవడం అంత సులభం అయ్యే పని కాదు.

హిడ్మా వయసు, రూపురేఖలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు. యువకుడిగా ఉన్నప్పటి పాత ఫోటోలు తప్పిస్తే వేరే చిత్రాలు పోలీసుల వద్ద లేవు. కొన్నేళ్లుగా బీజాపుర్‌, సుక్మా ప్రాంతాల్లో అతన్ని లక్ష్యంగా చేసుకుని నిఘా పెంచినా.. అటవీ ప్రాంతాలపై అతనికున్న పట్టు వల్ల బలగాలకు దొరకడం లేదు. ఆ నేతను పట్టుకుంటే.. ఉద్యమాన్ని బలహీనపర్చడం సులువుగా ఉంటుందనేది పోలీసుల అంచనా.

మావోయిస్టులు రాసిన లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందదో చూడాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్లు విడిపించాలని.. వారి కుటుంబ సభ్యులే కాదు యావత్ భారత దేశం డిమాండ్ చేస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మావోయిస్టులు లేఖలో నిజానిజాలపై ఆరా తీస్తోంది. నిజంగా బంధీని క్షేమంగా ఉంచారా లేదా? అన్నదానికి రుజువులు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Read Also… నైజీరియా జైలుపై బాంబులు, గ్రెనేడ్లతో సాయుధుల దాడి.. తప్పించుకుని పారిపోయిన 1,844 మంది ఖైదీలు