YouTube: యూట్యూబ్ చూస్తూ బాలుడికి ఆపరేషన్.. కాసేపటికే మృతి! డాక్టర్ పరార్
ఉత్తరాది దేశంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. వీరి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ నకిలీ డార్టర్ వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన బాలుడికి యూట్యూబ్ చూస్తూ శస్త్రచికిత్స చేశాడు. అయితే బాలుడి పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. ఇంతలో బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన..
పట్నా, సెప్టెంబర్: ఉత్తరాది దేశంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. వీరి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ నకిలీ డార్టర్ వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన బాలుడికి యూట్యూబ్ చూస్తూ శస్త్రచికిత్స చేశాడు. అయితే బాలుడి పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. ఇంతలో బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ ఘటన బిహార్‌లోని సరన్‌లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బీహార్‌లోని సరన్‌లో నివాసముంటున్న కృష్ణ కుమార్ (15) అనే బాలుడు పలుమార్లు వాంతులు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని గణపతి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాసేపటికి వాంతులు తగ్గిపోయాయి. సదరు ఆస్పత్రిలోని నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి పరీక్షించి బాలుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే బాలుడికి ఆపరేషన్ చేసి, వాటిని తొలగించాలని సూచించాడు. ఈ క్రమంలోనే సదరు నకిలీ డాక్టర్ యూట్యూబ్ చూస్తూ బాలుడికి ఆపరేషన్ చేశాడు. అయితే.. కాసేపటికే బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో కంగారు పడిన సదరు నకిలీ డాక్టర్ మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. మార్గం మధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి నకిలీ డాక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది పరారయ్యారు. అదే వాహనంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకు మృతితో కన్నీరుమున్నారయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి చందన్ షా మాట్లాడుతూ.. ఆపరేషన్ చేసిన డాక్టర్’కి సరైన విద్యార్హతలు ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఎలాంటి అనుభవం లేకుండానే.. సొంతంగా ఆపరేషన్ చేసినట్లు ఉన్నాడని తెలిపాడు.
బాలుడి తాతయ్య మాట్లాడుతూ.. ‘ఆస్పత్రికి వెళ్లగానే బాలుడికి ఆరోగ్యం మెరుగుపడింది. ఇంతలో ఓ పనిమీద బాలుడి తండ్రిని బయటికి పంపి, కుటుంబం అనుమతి లేకుండా నకిలీ డాక్టర్ యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు. అయితే బాలుడు కడుపు నొప్పితో అల్లాడుతుంటే.. ఆ నొప్పి ఎందుకు వస్తుందని మేము ప్రశ్నించగా డాక్టర్ మాపై ఆగ్రహం వ్యక్తం చేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు… వేరొక ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. బాలుడు మృతి చెందడంతో మార్గం మధ్యలోనే వదిలేసి, వారంతా పారిపోయారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.