Boat Accident: గంగా నదిలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి, ఏడుగురు గల్లంతు..!
గంగా అవతల ఉన్న పొలాలకు రైతులు పడవల సహాయంతో మాత్రమే చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే 12 మంది కూలీలు పడవలో గంగానది దాటి వెళ్తున్నారు.
బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కతిహార్ జిల్లా మణిహరిలోని హత్కోల్ గంగా ఘాట్ సమీపంలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుంది. నదిలో గల్లంతైన వారి కోసం SDRF బృందం వెతుకుతోంది. గంగాఘాట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గంగానదికి అవతలివైపు డయారా ప్రాంతం ఉంది. ఇక్కడ చాలా మంది రైతులు పర్వాల్‌ను సాగు చేశారని స్థానికులు తెలిపారు. గంగా అవతల ఉన్న పొలాలకు రైతులు పడవల సహాయంతో మాత్రమే చేరుకుంటారు. ఈ క్రమంలోనే, ఆదివారం(నవంబర్ 3) 12 మంది కూలీలు పడవలో గంగానది దాటి వెళ్తున్నారు. అయితే బోటు నది మధ్యలోకి రాగానే అదుపు తప్పింది. ఇంతలో పడవకు ఒకవైపు బరువు పెరిగి కొద్దిసేపటికే బోటు గంగలో మునిగిపోయింది.
పడవ మునిగిపోవడం చూసి ఘాట్ దగ్గర ఉన్న జనం కేకలు వేశారు. ఇంతలో, స్థానికులు సహాయం చేయడానికి కొంతమంది పడవలో వచ్చి ఐదుగురిని రక్షించారు. అయితే 7 మంది ఇప్పటికీ కనిపించలేదు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఎస్‌డీఓ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. SDRF బృందం నదిలో ప్రజల కోసం అన్వేషణలో నిమగ్నమై ఉంది.
గల్లంతైన వారిలో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. వారి పేర్లు లవ్లీ కుమారి, నేహా కుమారి. పర్వాల్ పొలంలో పని చేసేందుకు పడవలో వెళ్తున్నారని ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా చెప్పారు. పడవలో వెళుతున్న ఓ యువకుడు తన ప్రాణాలను పట్టించుకోకుండా ఇద్దరు పిల్లలను మరో పడవ ఎక్కేందుకు సహాయం చేశాడు. అయితే అతను మునిగిపోయాడని ఓ మహిళ చెప్పింది.
ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్న స్థానిక అధికారి తెలిపారు. SDRF బృందం నదిలో వ్యక్తుల కోసం అన్వేషణలో నిమగ్నమైంది. బోటులో ఉన్న కొంత మందిని రక్షించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న సమాచారాన్ని పడవలో కూర్చున్న వారి నుంచి రాబడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..