పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!
బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత బావిలోకి దిగిన తండ్రీకొడుకులతో సహా నలుగురు మృతి చెందారు. దోభి బ్లాక్‌లోని గఢ్ కరముని గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 14) ఈ ప్రమాదం జరిగింది. పాత బావిలో మోటార్ మరమ్మతు కోసం దిగితే విషవాయువుల బారినపడ్డారు. దీంతో నలుగురు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత బావిలోకి దిగిన తండ్రీకొడుకులతో సహా నలుగురు మృతి చెందారు. దోభి బ్లాక్‌లోని గఢ్ కరముని గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 14) ఈ ప్రమాదం జరిగింది. పాత బావిలో మోటార్ మరమ్మతు కోసం దిగితే విషవాయువుల బారినపడ్డారు. దీంతో నలుగురు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మోటార్ మరమ్మతు కోసం బావిలోకి..
గఢ్ కరముని గ్రామంలోని ఓ పాత బావిలో ఉన్న మోటార్‌ను మరమ్మతు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ గ్రామస్థుడు మోటార్‌ను బాగు చేసేందుకు బావిలోకి దిగాడు. అయితే లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం క్షీణించింది. విషవాయువుల ప్రభావంతో అతను నీటిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. తండ్రి ప్రమాదంలో చిక్కుకున్నాడని గుర్తించిన అతని కుమారుడు వెంటనే రక్షించేందుకు బావిలోకి దూకాడు. అయితే అతడూ విషవాయువుల ప్రభావానికి గురయ్యాడు. తండ్రీకొడుకులను కాపాడేందుకు మరో ఇద్దరు వ్యక్తులు కూడా బావిలోకి దిగారు. కొద్దిసేపటికే నలుగురూ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.
రెస్క్యూ సిబ్బందికీ ప్రమాదం
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. అయితే బావిలో విషవాయువుల తీవ్రత అధికంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రమాదకరంగా మారింది. బావిలోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిలో కొందరు కూడా స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. ఎంతో శ్రమించి బావిలో చిక్కుకున్న నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను విజయ్ చౌదరి, వికాస్ చౌదరి, దిల్‌చంద్ మంఝీ, చమరి మంఝీగా గుర్తించారు. వీరిలో విజయ్ చౌదరి, వికాస్ చౌదరి తండ్రీకొడుకులు. ఘటన గురించి తెలియడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.
ఒకే బావిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గఢ్ కరముని గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బావిలో విషవాయువులు ఎలా ఏర్పడ్డాయి? వాటి తీవ్రత ఎంత ఉంది? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
