
తెలంగాణ ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ వేలాది మంది జనసందోహం మధ్య భారీగా జరిగిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, లెఫ్ట్ పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్ సమావేశానికి హాజరై.. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అండగా ఉంటామని ప్రకటించారు. కాగా.. బీఆర్ఎస్ ఖమ్మం సభ అనంతరం మరుసటి రోజున బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదంటూ పేర్కొన్నారు. అయితే, తనకు ఈ సభకు ఆహ్వానం అందినా ‘సావధాన్ యాత్ర’, రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ఆ సభకు హాజరుకాలేక పోయేవాడిని అంటూ నీతిశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులుగా నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ (ఎన్డీఏ) కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపై రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. స్వప్రయోజనాలకోసం ఏమీ కోరుకోవడం లేదని.. జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉందంటూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు.
తెలంగాణలో జరిగింది బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమేని.. కొత్తకూటమి ఏర్పాటుకోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆహ్వానం అందుకున్న వారు ఆ సమావేశానికి హాజరయ్యారని.. ఒకవేళ తనకు ఆహ్వానం అందినా ప్రస్తుత బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోయేవాడిని అంటూ నీతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..