సరిహద్దుల్లో భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌కు వీరాభిమానిని అంటూ చైనా విదేశాంగశాఖ ఉన్నతాధికారి లీ జిమింగ్ వెల్లడించారు. అలాగే తమకు భారత్‌తో ఎటువంటి వ్యూహాత్మక శత్రుత్వం లేదంటూ పేర్కొన్నారు. అయితే.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో చైనా దౌత్యవేత్తగా ఉన్న లీ జిమింగ్.. ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, ఢిల్లీలోని చైనా దౌత్యవేత్త సన్ విడాంగ్ మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. లీ జిమింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ పదవీవిరమణ కార్యక్రమం ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌లోని చైనా దౌత్యవేత్త లీ జిమింగ్ మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా భారతదేశానికి పెద్ద అభిమానినని, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం- చైనా కలిసి పనిచేయగలవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. చైనాకు భారత్‌తో ఎలాంటి వ్యూహాత్మక శత్రుత్వం లేదని, భారీగా ఆయుధాలు మోహరించిన బంగాళాఖాతాన్ని చూడాలని కోరుకోవడం లేదని రాయబారి తెలిపారు. భారత్‌ను చైనాకు వ్యూహాత్మక శత్రువుగా లేక పోటీదారుగా మేము ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి మేం మరింత సన్నిహితంగా పనిచేస్తామని తెలిపారు. దీంతోపాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియా దేశాలు.. ఐరోపాలోని దేశాల వలే వ్యవహరించకూడదని చైనా కోరుకుంటుందని తెలిపారు.
భారత్, చైనా మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడాలంటే సరిహద్దు వద్ద ప్రశాంత వాతావరణం అవసరమని ఈ సందర్భంగా జై శంకర్ స్పష్టం చేశారు. ప్రజా, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకుసాగాలన్నారు. కాగా.. 2020 జూన్‌లో తూర్పు లఢాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తలతో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత చైనా – భారత్ మధ్య పలుమార్లు చర్చలు సైతం జరిగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..