Bengaluru Rains: ఆ నగరానికి ఏమైంది.. బురదలోనే ఐటీ హబ్.. నిలిచిపోయిన జనజీవనం..

Bengaluru Rains Updates: భారీ వరదలకు బెంగళూరు ఐటీ హబ్‌ మునిగింది. ఎలక్ట్రిక్ సిటీలో వరద బీభత్సం సృష్టించింది. కుండపోత వానలకు జనజీవనం స్థంభించింది. భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.

Bengaluru Rains: ఆ నగరానికి ఏమైంది.. బురదలోనే ఐటీ హబ్.. నిలిచిపోయిన జనజీవనం..
Bengaluru
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 08, 2022 | 9:33 PM

కర్ణాటకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బెంగళూరు నగరం సహా పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వానలకు కాలనీల్లోకి, ఇళ్లల్లోకి వరదనీరు పోటెత్తింది. జనజీవనం అతలాకుతలమైంది. సెల్లార్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదలకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఖరీదైన కార్లు వరదనీటిలో చిక్కుకొని జలసమాధి అయ్యాయి. కొన్ని చోట్ల వరదనీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరొకొన్ని చోట్ల వరద నీటితో, బురద మయంగా మారింది బెంగళూరు సిటీ. గత నాలుగు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవకపోవడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు నగరంలోని పలు కాలనీ ప్రజలు. ఇక్కడి పరిస్థితి చూస్తే.. మరో రెండుమూడు రోజులు బెంగళూరు వాసులకు వరదనీరు, బురద నీటి కష్టాలు తప్పేలా లేవు.

ఇదిలా ఉంటే మరోవైపు, వరదల కారణంగా బెంగళూరులో హోటళ్లలో గదుల టారిఫ్‌లు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ హబ్‌లో వరదలు, నీటి కష్టాలతో అనేక కుటుంబాలు హోటళ్లకు మకాం మార్చాయి. దీంతో హోటళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

పాత విమానాశ్రయం రోడ్డులోని ఎల్‌బీ శాస్త్రినగర్‌లో చాలా అపార్ట్‌మెంట్లకు నీటి సరఫరా, విద్యుత్తు నిలిచిపోవడంతో వారంతా హోటళ్లలో తలదాచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా రూ.10వేల నుంచి 20వేల మధ్య ఉన్న ఈ ధరలు తాజాగా ఒక రాత్రికి రూ.30 వేలు నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వ్యవసాయ పంటలతో పాటు అనేక చోట్ల ప్రాణ నష్టం ఏర్పడింది. పలు జిల్లాల్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు, హోమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్‌ కుమార్‌ సారథ్యంలోని కేంద్ర బృందం కర్ణాటకలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి