Bengaluru Rains: బెంగళూరులో మళ్లీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.. రోడ్లపై ప్రజల నరకయాతన..
కర్ణాటక రాజధాని బెంగళూరు వరుణుడు దాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద నీటికి రహదారులు మునిగిపోవడంతో ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు సోమవారం..
Bengaluru Rains: కర్ణాటక రాజధాని బెంగళూరు వరుణుడు దాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద నీటికి రహదారులు మునిగిపోవడంతో ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షం బెంగళూరు(Bengaluru) నగరాన్ని ముంచేసింది. భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఇళ్లకు చేరుకోలేక జనం రోడ్డుపైనే నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు, ట్రాఫిక్ జామ్‌లకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగడంలేదని, ఎండిపోయిన చెరువులపై ప్రణాళికలేకుండా నిర్మిస్తున్న కట్టడాలతో మోస్తరు వర్షం కురిసినా వరదలకు దారితీస్తోందని పలు కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు రబ్బరు బోట్లను మోహరించడం.. విమానాశ్రయం నుంచి ప్రయాణికులను తరలించేందుకు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంకోవైపు, ద అవుటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ (ORRCA), ద అంబరిల్లా గ్రూప్ వంటి ఐటీ సెక్టార్ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని సూచించాయి. వర్షాల కారణంగా నగరంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు మరోరెండు రోజులు ఇబ్బందులు తప్పవని బెంగళూరు నగర నీటిసరఫరా, మురుగు నీటి బోర్డు (Bwssb) హెచ్చరించింది.
త్వరలో సాధారణ పరిస్థితులు: సీఏం బసవరాజ్ బొమ్మై
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి టీకే హళ్లి సమీపంలోని పంప్ హౌజ్ పొంగిపొర్లడంతో భారీగా నష్టం వాటిల్లిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో చుట్టుపక్కల ఉన్న చెరువులు పొంగిపొర్లుతూ అనేక ఇబ్బందులకు గురిచేశాయన్నారు. సీనియర్ అధికారులంతా సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను చేపడుతున్నారని.. ఒక్క రోజులో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..