రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆయన కామెంట్స్‌పై బీజేపీ భగ్గుమనడంతో గిరి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. బెంగాల్ మంత్రి అఖిల్‌గిరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ఉద్దేశించి.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నందిగ్రామ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అఖిల్‌గిరి చేసిన కామెంట్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు కమలం పార్టీ శ్రేణులు. తాను చూడటానికి బాగాలేనంటూ ప్రతిపక్షనేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ- రాష్ట్రపతి ముర్ము ఎలా ఉన్నారంటూ మంత్రి అఖిల్‌గిరి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. అఖిల్‌గిరి దిష్టిబొమ్మను తగలబెట్టారు.
ఆయన వ్యాఖ్యలను బట్టి తృణమూల్‌కు మహిళలంటే ఎంత గౌరవముందో అర్థమవుతుందని విమర్శించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అటు తృణమూల్ కూడా గిరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని..పార్టీకి సంబంధం లేదని తెలిపింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీఎంసీ..మహిళలపై ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు సరికాదంటూ ట్వీట్ చేసింది. మరోవైపు దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.
దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి అఖిల్‌గిరి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు. తాను రాష్ట్రపతిని ఎంతగానో గౌరవిస్తానని, దీన్ని అడ్డుగా పెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలు ద్రౌపది ముర్మును బాధపెట్టి ఉంటే క్షమాపణ కోరుతున్నానని స్పష్టం చేశారు. అయినప్పటికీ వివాదం మాత్రం సద్దుమణగడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..