Inter Exams: కాలు విరిగినా సడలని పట్టుదల.. ఆస్పత్రి బెడ్‌పై పడుకునే పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధి! ఎక్కడంటే..
పేదరికంలో మగ్గిపోతున్న తన కుటుంబాన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ఆ బాలుడి పట్టుదల ముందు విధి ఓడిపోయింది. కాలు విరిగినా ఆ నొప్పికి బయపడలేదు. ఆస్పత్రి బెడ్‌పై పడుకునే ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. మార్చి 5 నుంచి పరీక్షలు ప్రారంభమవగా.. అన్ని పరీక్షలు రాస్తానని, ఏ పరీక్షను వదిలేది లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది..

మధురై, మార్చి 6: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ పాఠశాల విద్యార్థి స్ట్రెచర్‌పై పడుకుని పరీక్ష రాసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని మదురైలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మధురై జిల్లాలోని నెడుంగుళం గ్రామానికి చెందిన దినేష్ అనే విద్యార్థి మధుర జూనియర్ కాలేజీలో 11వ తరగతి చదువుతున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం దినేష్ స్కూల్‌కు వెళ్లేందుకు విరాధనూర్ సమీపంలో స్కూల్ బస్సు కోసం వేచి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒకటి ఆ విద్యార్థిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు, దినేష్ కాలు, తుంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఆస్పత్రిలోనే కష్టపడి చదువుతున్నాడు. కాలు విరిగిపోవడం వల్ల లేచి నడవలేని సరిస్థితి.
ఈ క్రమంలో 11వ తరగతి పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమవుతుండగా.. దినేష్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెడ్‌పైనే పరీక్షలు రాసేందుకు.. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, పాఠశాల యాజమాన్యం స్ర్కైబ్ సహాయంతో పరీక్ష రాయడానికి అనుమతించింది. దీంతో మార్చి 5న స్ట్రెచర్‌పై పడుకునే తొలిరోజు తమిళ లాంగ్వేజ్ పరీక్ష రాశాడు. పడుకుని తాను చదివిన అంశాలు చెబుతుంటే.. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ వద్ద కూర్చుని స్ర్కైబ్ పరీక్ష రాసింది. ఆ విషయం వైరల్ కావడంతో దినేష్ చదువుతున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ప్రశంసించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన విద్యార్థి దినేష్ చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును చదివిస్తుంది. కొడుకును ఉన్నత చదువులు చదివించి, మంచి స్థాయిలో ఉండాలని కలలు కనింది. తల్లి కలను నెరవేర్చడానికి కాలు విరిగినప్పటికీ దినేష్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసి అందరినీ అబ్బురపరిచాడు.
కాగా తమిళనాడులో ఇది పరీక్షల సీజన్. మార్చి ఆరంభం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 10, 11, 12 తరగతులకు పబ్లిక్ పరీక్షలు పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమయ్యాయి. ఇక మార్చి 5వ తేదీ నుంచి 11వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,18,369 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరితోపాటు 4 వేల మంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్ధులు, 137 మంది జైలు ఖైదీలు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 27 వరకు జరుగుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




