AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రతా దళాలే లక్ష్యంగా భారీ పేలుడు.. భారత జవాన్ మృతి, నలుగురికి గాయాలు!

ఈశాన్య భారతదేశంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నాగాలాండ్‌లోని చుమౌకెడిమా పరిధిలో గల సుఖోయ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ సమీపంలో శక్తివంతమైన అనుమానిత పేలుడు పదార్థం (IED) పేలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘోర పేలుడులో ఒక సైనికుడు వీరమరణం పొందగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

భద్రతా దళాలే లక్ష్యంగా భారీ పేలుడు.. భారత జవాన్ మృతి, నలుగురికి గాయాలు!
Ied Blast In Nagaland
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 7:20 PM

Share

ఈశాన్య భారతదేశంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నాగాలాండ్‌లోని చుమౌకెడిమా పరిధిలో గల సుఖోయ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ సమీపంలో శక్తివంతమైన అనుమానిత పేలుడు పదార్థం (IED) పేలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘోర పేలుడులో ఒక సైనికుడు వీరమరణం పొందగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌ను టార్గెట్ చేస్తూ ఐఈడీ పేలుడు జరగడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

భద్రతా దళాల కథనం ప్రకారం.. అస్సాం రైఫిల్స్ జవాన్లు తమ వాహనాల్లో సుఖోయ్ ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా, రహదారి పక్కన అమర్చిన ఐఈడీ ఒక్కసారిగా పేలిపోయింది. భద్రతాపరంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా పరిగణించే చుమౌకెడిమాలో ఈ ఘటన జరగడంతో రక్షణ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అస్సాం రైఫిల్స్, నాగాలాండ్ పోలీసులు, భారత సైన్యం నుండి అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన నలుగురు సైనికులను వెంటనే సమీపంలోని సైనిక వైద్య కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఒక జవాను పరిస్థితిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

ఈ పేలుడు సంభవించిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దిగ్బంధించాయి. చుమౌకెడిమా సమీపంలోని దట్టమైన అడవుల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానిత ఉగ్రవాదుల కోసం భారీ ఉమ్మడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యూహకర్తలు ఎవరు, ఏ ఉగ్రవాద సంస్థ దీనికి పాల్పడిందనే కోణంలో నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. అలాగే, పేలుడు తీవ్రతను, వాడిన పదార్థాలను విశ్లేషించేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.

వారం రోజుల్లో రెండో ప్రధాన దాడి!

ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం రైఫిల్స్‌ను లక్ష్యంగా చేసుకుని వారం వ్యవధిలో జరిగిన రెండవ పెద్ద దాడి ఇది. అంతకుముందు, జూలై 6న మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. అస్సాం రైఫిల్స్ 40వ బెటాలియన్‌కు చెందిన కాన్వాయ్‌పై జరిగిన ఆ దాడిలో వారెంట్ ఆఫీసర్ బల్వంత్ సింగ్, రైఫిల్‌మ్యాన్ సిఎం సింగ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమరులయ్యారు. ఆ ఘటన తర్వాత ఇరుపక్షాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. మణిపూర్ ఉదంతం మరవకముందే ఇప్పుడు నాగాలాండ్‌లో మరో జవాను బలికావడం ఈశాన్య సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతానికి నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలన్నిటా హై అలర్ట్ ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us