AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ జీ.. గులాబీకి సీజన్ ఉంటుంది! దీపావళికి కాదు.. అస్సాం సీఎం హిమంత స్ట్రాంగ్ కౌంటర్!

రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో స్పందించారు. సభలో గొడవలు లేకుండా చర్చ జరగాలని, రాహుల్ చర్చను ప్రారంభిస్తే ప్రధాని సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

రాహుల్ జీ.. గులాబీకి సీజన్ ఉంటుంది! దీపావళికి కాదు.. అస్సాం సీఎం హిమంత స్ట్రాంగ్ కౌంటర్!
Himanta Biswa Sarma, Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Nov 04, 2026 | 6:45 PM

Share

న్యూఢిల్లీ: రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో స్పందించారు. దీపావళి సందర్భంగా ప్రధాని మోదీకి గులాబీ అందిస్తూ.. రాహుల్ గాంధీ చేసిన వీడియోను ప్రస్తావిస్తూ, ‘‘ప్రియమైన రాహుల్ జీ.. గులాబీలు వాలెంటైన్స్ డే రోజున ఇస్తారు.. దీపావళి రోజున కాదు. ఏదేమైనా, పార్లమెంట్‌లో బీజేపీ మిమ్మల్ని కలుస్తుంది’’ అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నవంబర్ 4న విడుదల చేసిన వీడియోలో హిమంత మరింత ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని, ప్రధానితో చర్చించాలంటే వీధుల్లోనా, సందుల్లోనా లేక పార్లమెంట్‌లోనా అని ప్రశ్నించారు. సభలో స్పీకర్ ఉండగా, చర్చకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను న్యాయనిర్ణేతగా ఎందుకు ప్రతిపాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్‌లోనే ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

భారత్-అమెరికా ఒప్పందంపై చర్చకు రాహుల్ చేసిన డిమాండ్‌ను ప్రస్తావిస్తూ, అసలు ఒప్పందం ఎక్కడుందని ప్రశ్నించారు. బోఫోర్స్ వివాదం నుంచి భోపాల్ గ్యాస్ దుర్ఘటన వరకు అనేక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించవచ్చని అన్నారు. సభలో గొడవలు లేకుండా చర్చ జరగాలని, రాహుల్ చర్చను ప్రారంభిస్తే ప్రధాని సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

రాహుల్ విదేశీ పర్యటనలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందంపై సంతకం చేశారని హిమంత ఆరోపణలు గుప్పించారు. రాహుల్‌ను ఉద్దేశించి ‘‘ఎప్పుడూ ఆగ్రహంతో ఉండే యువకుడిలా వ్యవహరించకండి.. మంచి నాయకుడిగా ఎదగాలంటే పార్లమెంట్‌లో ప్రశాంతంగా చర్చించండి’’ అని హిమంత హితవు పలికారు.

ఇదిలావుంటే, రాహుల్ గాంధీ నవంబర్ 3న ప్రధాని మోదీకి వీడియో ద్వారా బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఆర్థిక వ్యవస్థ, భారత్-అమెరికా ఒప్పందం, అదానీ వ్యవహారం, ఎప్‌స్టీన్ వివాదం, విదేశీ సంబంధాలపై బహిరంగంగా చర్చిద్దామని ప్రతిపాదించారు. మీడియా, యువత సమక్షంలో ఇద్దరం ఎదురెదురుగా కూర్చుందామని, న్యాయనిర్ణేతగా ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చని, అవసరమైతే మోహన్ భగవత్‌ను కూడా నియమించుకోవచ్చని సూచించారు. తనపై ఇప్పటికే సుమారు 45 పరువు నష్టం కేసులు ఉన్నాయని కూడా రాహుల్ పేర్కొన్నారు.

ఇలా రాహుల్ బహిరంగ చర్చకు సవాల్ విసరడం, దానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సమాధానం ఇవ్వడం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. గులాబీ పువ్వుతో మొదలైన ఈ రాజకీయ మాటల యుద్ధం చివరకు పార్లమెంట్ చర్చ వరకు వెళ్తుందా? ప్రధాని మోదీ నుంచి దీనిపై స్పందన వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us