Jagan-Chandra Babu: ఆంధ్రా రాజకీయాలలో కీలక పరిణామం.. ఒకే వేదికపై సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని జగన్, చంద్రబాబులకు పిలుపు అందింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు..

Jagan-Chandra Babu: ఆంధ్రా రాజకీయాలలో కీలక పరిణామం.. ఒకే వేదికపై సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?
Ncb, Pm Modi, Cm Jagan
Follow us

|

Updated on: Nov 25, 2022 | 7:23 AM

ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్రం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సదస్సులు, సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని జగన్, చంద్రబాబులకు పిలుపు అందింది. ఎవరూ ఊహించని విధంగా ఒకే వేదికను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంచుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇది కీలక పరిణామం. అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు అందాయి. జీ20 దేశాల సదస్సు తీరుతెన్నులు, అజెండాపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు.

భారత్‌లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చ జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులందరికీ ఆహ్వానం పంపారు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్‌ 5న దేశ రాజధానికి చేరుకుంటారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే రోజున ఢిల్లీకి చేరుకుని.. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరవుతారు. కాగా,  ప్రస్తుతం భారత్‌ జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తోంది. త్వరలో భారత్ వేదికగా జరగబోయే జీ20 సదస్సుకు సంబంధించి రాజకీయ పార్టీ అధినేతల సలహాలు, సూచనలు తీసుకునేందుకు కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది.

గతంలోనూ ఇలాగే..

దేశంలోని రాజకీయ పార్టీ అధినేతలకు కేంద్రం అహ్వానం పంపించడం ఇదేం మొదటి  సారి కాదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల అధినేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుకు ఇది మూడో అహ్వానం..

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఈ ఏడాదిలో అందిన మూడో అహ్వానం ఇది. మొదటి సారిగా అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుందనే విషయంలో.. కేంద్రం దేశంలోని ప్రముఖులందరికీ అహ్వానం పంపింది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబుకు ఆహ్వానం అందగా.. ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా కలిసిన ప్రధాని మోదీ, చంద్రబాబు కొంత సమయం సరదాగా మాట్లాడుకున్నారు. ఇక రెండో సారి.. ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు వచ్చిన సమయంలో కూడా టీడీపీకి ఆహ్వానం అందింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాలని.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి టీడీపీని ఆహ్వానించిన సంగతి తెలసిందే. అయితే అప్పుడు టీడీపీ తరపున చంద్రబాబుకు బదులుగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు మూడో సారి కేంద్రం నుంచి చంద్రబాబుకు సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది.