Amul vs Nandini: కర్ణాటకలో రసవత్తరంగా పాల పాలిటిక్స్.. ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చేందుకు నేతల విఫలయత్నం

కర్నాటక రాజకీయాల్లో ఇప్పుడు పాలు చిచ్చు పెట్టాయి. గుజరాత్ పాల సమాఖ్యకు చెందిన అమూల్ బెంగళూరులో ఈ కామర్స్ ప్లాట్ ఫాంల ద్వారా అమ్మకాలు ప్రారంభిస్తామని ప్రకటించడం ఈ చిచ్చు రేగడానికి ప్రధాన కారణం. అమూల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్థానిక పాల..

Amul vs Nandini: కర్ణాటకలో రసవత్తరంగా పాల పాలిటిక్స్.. ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చేందుకు నేతల విఫలయత్నం
Amul Vs Nandini

Updated on: Apr 11, 2023 | 7:59 PM

కర్నాటక రాజకీయాల్లో ఇప్పుడు పాలు చిచ్చు పెట్టాయి. గుజరాత్ పాల సమాఖ్యకు చెందిన అమూల్ బెంగళూరులో ఈ కామర్స్ ప్లాట్ ఫాంల ద్వారా అమ్మకాలు ప్రారంభిస్తామని ప్రకటించడం ఈ చిచ్చు రేగడానికి ప్రధాన కారణం. అమూల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్థానిక పాల సంస్థలకు చెందిన పాల ఉత్పత్తులకు గండం పొంచి ఉన్నట్టేనన్నది విమర్శకుల మాట. కర్నాటకలో నందిని పాల బ్రాండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విజయ, విశాఖ పాల బ్రాండ్లు ఎలాగో.. కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా నందిని పాల బ్రాండ్‌కు అంతకు మించి డిమాండ్ ఉంది. కర్నాటక రాష్ట్రంలో 70 శాతం నందిని బ్రాండ్‌ వినియోగిస్తున్నారు. ఈక్రమంలో అమూల్ ఎంటరైతే నందిని పాల మార్కెట్‌కి ఆటంకం ఏర్పడి కన్నడ రైతుల పాలిట శాపంగా మారుతుందనేది కాంగ్రెస్‌ మాట. అందుకే అమూల్ బ్రాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అంటోంది. నిజానికి కర్నాటకలో అమూల్ రాక 7-8 ఏళ్ల క్రితమే జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆ మాటకొస్తే మన దగ్గర హెరిటేజ్ నుంచి జెర్శీ, సంగం, కరీంనగర్ ఇలా చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. రైతులు కూడా ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వారికే పాలు అమ్మడం కూడా సర్వ సాధారణమైన విషయం. ఈ చిన్న విషయం కన్నడ వాసులకు తెలియందికాదు. ఈ వ్యవహారాన్ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మర్చుకుంటున్నారు.

బీజేపీ అగ్ర నేత అమిత్ షా కొద్ది రోజుల క్రితం మైసూరకు సమీపంలోని మాండ్యా ప్రాంతంలో జరిగిన పర్యటనలో అమూల్-నందిని కలిసి మూడేళ్లలో కర్నాటకలోని ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాల డైరీని ఏర్పాటు చేస్తాయని ప్రకటించారు. దీంతో వివాదానికి బీజం పడింది. ఆ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే బెంగళూరుకు విస్తరిస్తున్నట్టు అమూల్ ట్వీట్ చెయ్యడంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. గుజరాత్‌కు చెందిన అమూల్‌ కన్నడ నాట ప్రవేశ పెట్టి కర్నాటక పాల మార్కెట్‌ని నాశనం చేయాలని బీజేపీ భావిస్తుందంటూ కాంగ్రెస్‌ పలుకుతోంది. ఇలాంటి వివాదం ఏపీలో కూడా తలెత్తింది. కానీ కొన్నిరోజులకే సర్దుమనిగింది. కానీ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అలా ఉండదు. తమ జాతి, భాష, సంస్కృతి మనుగడుకు ముప్పు తలెత్తుతుందంటే దేనికైనా వెనుకాడరు. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ నే పట్టుకొని కన్నడ అస్థిత్తవాన్ని చంపేసేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడ ఇదని, అందుకే గుజరాత్ ప్రొడక్టును కర్నాటకలో అడుగుపెట్టేలా చేస్తోందని దాంతో కర్నాటక పాల మార్కెట్‌ అస్థిత్వానికి ముప్పుతప్పదని కాంగ్రెస్‌ ఎత్తిచూపుతోంది.

దీంతో బెంగళూరులోని హోటల్ సంఘాలన్నీ అమూల్ పాలను బ్యాన్ చెయ్యాలని డిసైడ్ అయ్యాయి. సెంట్రల్‌ కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. లింగాయత్‌లు మొదట్నుంచీ బీజేపీకి అనుకూలంగా నిలుస్తున్నారనే పేరుంది. ఒక్కలిగలు మాత్రం జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌లకు అండగా ఉంటున్నారు. ఈసారి బీజేపీ అక్కడ మెజార్టీ సీట్లు పొందేందుకు ఆ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మోదీ, షాలు పదేపదే ఇక్కడ పర్యటనలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలా ఒక్కలిగ కంచుకోటను బద్దలు కొట్టాలన్న కమలనాథుల ఎత్తులకు తాజాగా నందిని-అమూల్‌ వివాదం రూపంలో కాంగ్రెస్‌ పైఎత్తు వేసింది. అమూల్‌-నందిని కలసి పనిచేయాలని వ్యాఖ్యానించటం ద్వారా కాంగ్రెస్‌ నెత్తిన ‘పాలు’ పోశారు షా. ఇప్పుడు ఆ పార్టీ విమర్శలను తిప్పికొట్టడానికి భాజపా నేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వివాదం కన్నడ సెంటిమెంటుగా మారుతుండటం కమలనాథులను కలవరపెడుతోంది. ప్రస్తుతం కర్నాటక మార్కెట్లో లీటర్ అమూల్ పాల ధర 54 రూపాయలు, అదే నందిని లీటర్ పాల ధర కేవలం 39 రూపాయలు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పాల ధరను తగ్గించే ఆలోచన లేదని అటువంటప్పుడు నందిని పాల ఉత్పత్తులకు తమ వల్ల డ్యామేజ్ ఎలా జరుగుతుందని అమూల్‌ యాజమన్యం ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే అమూల్ లాంటి 55 వేలకోట్లకు పైగా టర్నోవర్ ఉన్న అతి పెద్ద పాల ఉత్పత్తుల సంస్థ ఓ స్థానిక మార్కెట్‌ను టార్గెట్ చేస్తే… ధర తగ్గించి అమ్మడం పెద్ద సమస్యేం కాదు. అటు సాక్షాత్తు హోం మంత్రే అమూల్-నందిని కలిసి పని చెయ్యాలనడం, ఆ తర్వాత అమూల్ బెంగళూరులో ఎంటరవుతున్నామని చెప్పడం.. ఇవన్నీ తమ రాష్ట్రంలో అమూల్ పెత్తనం చెలాయించడంలో తొలి అడుగులన్నది కాంగ్రెస్ నేతల మాట. స్థానిక పాల సమాఖ్యలను చంపేసి అక్కడ కూడా గుజరాత్ పెత్తనం ఉండాలన్నదే బీజేపీ ఆలోచన అని.. అందులో భాగమే కర్నాటకలో ఈ అమూల్ రాజకీయం అంటున్నారు కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. అయితే దీనిపై బీజేపీ కూడా ఓ రకంగా డిఫెన్స్‌లో పడిందనే చెప్పొచ్చు. ఎన్నికల ముందు ఈ ఊహించని పాల పొలిటికల్ ఉత్పాతాన్ని తట్టుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అమూల్ విషయంలో తాము చాలా క్లియర్‌గా ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్ దీన్ని కావాలనే రాజకీయం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. నందిని బ్రాండ్ కేవలం కర్నాటకకు మాత్రమే పరిమితం కాదని, ఇప్పటికే ఢిల్లీలోనూ నందిని పాల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయని, త్వరలోనే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటికే 55 వేల కోట్ల టర్నోవర్ ఉన్న అమూల్ వచ్చే ఏడాదికి దాన్ని 66 వేల కోట్లకు పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందులో భాగంగా తన వ్యాపార వ్యూహాలను కచ్చితంగా అమలు చేస్తుంది. ఒక్క గుజరాత్‌లో మాత్రమే పాలు అమ్ముకుంటూ కూర్చుంటే అది ఈ రేంజ్ బ్రాండ్ అయి ఉండేదే కాదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో విస్తరించి లాభాలు గడిస్తోంది. చివరిగా పాలు ఉత్పత్తి చేసే రైతులు ఎవరు ఎక్కువ లాభాన్ని అందిస్తే వారికే పాలు అమ్ముతారు. ఎన్నికల ముందు జనంలో సెంటిమెంట్ రగిల్చే ఓ ఇష్యూ రాజకీయ పార్టీలకు దొరికింది.. దాన్ని వీలైనంత క్యాష్ చేసుకునేందుకు ఎవరికి వాళ్లు ప్రయత్నిస్తున్నారే తప్ప, కన్నడ పాల రాజకీయంలో కొత్త విషయమేం లేదని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.