సీఏఎపై ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ‘సమరశంఖం’ !
సవరించిన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ పోరాటాన్ని తీవ్రం చేసే పనిలో పడబోతోంది. ఈ చట్టాన్ని అమలుచేయకపోవడం రాజ్యాంగ విరుధ్ధమేమీ కాదన్న సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ సీఏఎకి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాలని సూచించింది. మొట్టమొదట పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభలో ఈ మేరకు తీర్మానాన్ని అందించింది. అందువల్లే ఇతర అన్ని కాంగ్రెస్ […]
సవరించిన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ పోరాటాన్ని తీవ్రం చేసే పనిలో పడబోతోంది. ఈ చట్టాన్ని అమలుచేయకపోవడం రాజ్యాంగ విరుధ్ధమేమీ కాదన్న సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ సీఏఎకి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాలని సూచించింది. మొట్టమొదట పంజాబ్ లో సీఎం అమరేందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభలో ఈ మేరకు తీర్మానాన్ని అందించింది. అందువల్లే ఇతర అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలూ ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. పంజాబ్ తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలా తీర్మానాలను ఆమోదించాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ చట్టంపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని తాము కోరుతున్న సంకేతానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
సీఏఎని అమలు చేయజాలమని కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అశక్తతను వెలిబుచ్చిన నేపథ్యంలో కపిల్ సిబల్, జైరాంరమేష్ వంటి సీనియర్ నేతలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ చట్టంపై అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన పక్షంలో ఏ రాష్ట్రంకూడా దీన్ని అమలుచేయబోమని ప్రకటించజాలదని మొదట కపిల్ సిబల్ పేర్కొన్నారు. ‘ఇది సాధ్యం కాదు.. రాజ్యాంగ విరుధ్ధం కూడా.. తొలుత అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసి.. ఆ తరువాత దీన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరడమన్నది చిక్కులతో కూడిన వ్యవహారం ‘ అని ఆయన అన్నారు. అయితే ఈ చట్టం రాజ్యాంగవిరుధ్ధమని ఆయన ఆ తరువాత ట్వీట్ చేశారు. ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి కూడా తీర్మానాన్ని ఆమోదించే రాజ్యాంగ హక్కు ఉందని, అదే సమయంలో దాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరవచ్చునని, ఇది రాజ్యాంగవ్యతిరేకమేమీ కాదని సిబల్ స్పష్టం చేశారు. కానీ ఈ చట్టం రాజ్యాంగబద్డమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు దీనిని వ్యతిరేకించడం సమస్యలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ ఏమైతేనేం ? ఫైట్ అలా కొనసాగుతుంటుంది ‘ అని కూడా సీనియర్ న్యాయవాది కూడా అయిన కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.