ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై స్టేకు సుప్రీం తిరస్కృతి

2018 నాటి ఎలక్టోరల్ బాండ్స్ పథకంఫై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  ఈ బాండ్స్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని.. దీనిపై సమాధానాన్ని దాఖలు చేసేందుకు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సీజేఐ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ రెండు వారాల వ్యవధినిచ్చింది. ఈ పథకంపై స్టే జారీ చేయవలసిందిగా కోరుతూ సీపీఐ(ఎం), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్)  పిటిషన్ దాఖలు చేశాయి. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య […]

ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై స్టేకు సుప్రీం తిరస్కృతి
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2020 | 1:00 PM

2018 నాటి ఎలక్టోరల్ బాండ్స్ పథకంఫై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  ఈ బాండ్స్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని.. దీనిపై సమాధానాన్ని దాఖలు చేసేందుకు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సీజేఐ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ రెండు వారాల వ్యవధినిచ్చింది. ఈ పథకంపై స్టే జారీ చేయవలసిందిగా కోరుతూ సీపీఐ(ఎం), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్)  పిటిషన్ దాఖలు చేశాయి. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ బాండ్ల వినియోగ మినహాయింపును 2017 లోఫైనాన్స్ చట్టం ప్రవేశపెట్టింది. ఈ చట్టంలోను, 2016 నాటి చట్టంలోను చేసిన కొన్ని సవరణలు విదేశీ కంపెనీలనుంచి కూడా అపరిమితంగా పార్టీలు  రాజకీయ విరాళాలు సేకరించేందుకు అనువుగా కవాటాలు తెరిచే వీలు కల్పించాయని ఏడీఆర్ తో బాటు మరో ఎన్జీఓ కూడా తన పిటిషన్ లో ఆరోపించింది.

రాజకీయ విరాళాలకోసం ఎలక్టోరల్ బాండ్ల వినియోగం అన్నది ఆందోళన కలిగించే అంశమని ఇవి బేరర్ బాండ్ల తరహాలో ఉన్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఏడీఆర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఈ పథకం కింద సుమారు 6 వేల కోట్లు సేకరించారని తెలిపారు. అయితే ఇందుకు రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల కమిషన్ అంగీకరించలేదన్నారు. ఎన్నికలముందు అక్రమంగా ఈ పథకాన్ని తెచ్చారని ఆయన విమర్శించారు.వడ్డీ లేని ఈ బాండ్లను ఎస్ బీ ఐ శాఖలనుంచి వెయ్యి, లక్ష, 10 లక్షలు, కోటి రూపాయలవరకు పొందవచ్చు. కానీ ఈ పథకం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపవచ్చునని సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 12న అభిప్రాయపడింది. ఈ బాండ్ల ద్వారా అందుకున్న నిధుల వివరాలను అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల కమిషన్ కు సీల్డ్ కవర్ ద్వారా సమర్పించాలని ఆదేశించింది. తాము  రూ. 1931.4 కోట్ల నిధులను సేకరించినట్టు బీజేపీ, కాంగ్రెస్, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు గతంలో ప్రకటించాయి. అయితే ఇది ఆయా పార్టీల మొత్తం ఆదాయం కన్నా 52 శాతం ఎక్కువని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ పేర్కొంది. ఈ బాండ్ల ద్వారా బీజేపీ రూ. 1450.89 కోట్లను, కాంగ్రెస్..రూ.383.26 కోట్లను, తృణమూల్ కాంగ్రెస్.. రూ. 97.28 కోట్లను సేకరించాయి.ఈ బాండ్ల విషయంలో మోదీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చిందని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తమవద్ద ఉన్నాయని ఏడీఆర్ లోగడే ప్రకటించిన విషయం గమనార్హం. అయితే రాజకీయ పార్టీలకు  నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం తమ విధానపరమైన నిర్ణయమని, ఇందుకు తమను తప్పు పట్టరాదని కేంద్రం తన వాదనను వినిపిస్తోంది.