అస్సాం- మిజోరాం మధ్య మళ్ళీ ఉద్రిక్తత తలెత్తుతోంది. కోడి గుడ్లతో మిజోరాం వెళ్తున్న నాలుగు ట్రక్కులను అస్సాంలోని కచార్ జిల్లాలో నిన్న రాత్రి స్థానికులు ధ్వంసం చేశారు. లారీల్లోని కోడి గుడ్లను రోడ్డుపై విసిరివేశారు. పొరుగునున్న మిజోరాం రాష్ట్రానికి సరుకులతో వెళ్తున్న లారీలను గానీ, వాహనాలను గానీ అడ్డగించవద్దని అస్సాం ప్రభుత్వం ప్రజలను కోరింది. కానీ ఈ ఆదేశాలను వారు పక్కన బెట్టారు. కచార్ జిల్లాలోని కరీం గంజ్ నుంచి ఈ ట్రక్కులు మిజోరాం వెళ్తున్నాయి. ఇవి బాగా బజార్ అనే ప్రాంతానికి చేరగానే కొంతమంది స్థానికులు వీటిని ఆపి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారని, మిజోరాంకు అని డ్రైవర్లు చెప్పగానే వారు లారీలను ధ్వంసం చేసి గుడ్లను రోడ్డుపై విసరి వేశారని తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత నెల 26 న ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో అస్సాం పోలీసులు ఏడుగురు మరణించగా.. రెండు రాష్ట్రాలకు చెందిన దాదాపు 80 మంది గాయపడ్డారు.
అయితే ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, బార్డర్ లో శాంతి నెలకొనేలా చూడాలని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిర్ణయించారు. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మపై పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేయాలని మిజోరాం సీఎం జొరాంతాంగా తమ పోలీసులను ఆదేశించగా.. అలాగే మిజోరాం ఎంపీపై పెట్టిన కేసును ఎత్తివేయాలని అస్సాం సీఎం కూడా తమ రాష్ట్ర పోలీసులకు సూచించారు. పైగా సరిహద్దుల్లోని పోలీసులు తమ తమ పోస్టులకు తాము తిరిగి వెళ్లాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆదేశించారు. కానీ తాజాగా జరిగిన పరిణామం తిరిగి వీటి మధ్య ఉద్రిక్తతను రెచ్చగొట్టేదిగా ఉందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కుంభ్ మేళాలో లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు.. 5 ల్యాబ్ లపై ఈడీ దాడులు.. 31 లక్షల స్వాధీనం