7 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ పునరుద్ధరణ పనులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేపట్టింది. కాశ్మీరీ పండిట్ల వలసల కారణంగా మూసివేయబడిన ఈ ఆలయం.. 2014 లో వచ్చిన భయంకర వరదల కారణంగా చాలా వరకు విధ్వంసమైంది. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన శ్రీనగర్‌లోని 700 ఏళ్ల పురాతన మంగళేశ్వర భైరవ ఆలయ పునరుద్ధరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అధికారులు సమాచారం అందించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.1.62 కోట్లు ఖర్చవుతుందని వచ్చే నెలలో పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్‌లోని బాబా డెంబ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి కాశ్మీరీ పండిట్ సమాజంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆలయ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో శ్రీనగర్ డిప్యూటీ కమీషనర్ మహ్మద్ ఎజాజ్ అసద్ మాట్లాడుతూ.. ఈ ఆలయం సుమారు 700 సంవత్సరాల పురాతనమైనది. దాని ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. 2014 సెప్టెంబరులో వరదల కారణంగా ఆలయ గోడలకు కొన్ని పగుళ్లు వచ్చాయి. అందువల్లే ఆర్కిటెక్చర్, వారసత్వ సంపదను పునరుద్ధరించడానికి, రక్షించి, పరిరక్షించడానికి, మరమ్మతులు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించామని చెప్పారు.
మహ్మద్ ఎజాజ్ అసద్ మాట్లాడుతూ, పునరుద్ధరణ పనులు ప్రారంభించే ముందు ఆలయ నిర్మాణం అసలు రూపాన్ని కాపాడేందుకు ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించామని చెప్పారు. ఆలయంలో పవిత్రంగా భావించే రెండు మహా వృక్షాలు ఉన్నాయని, పునరుద్ధరణ సమయంలో వాటిని తాకలేదని ఆయన చెప్పారు. పునర్నిర్మాణానికి సిమెంట్ ఉపయోగించటం లేదన్నారు, కానీ, దానిని తయారు చేసిన అదే పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. లక్షలాది ప్రజల విశ్వాసం ఈ ఆలయంపై ఉందని అసద్ అన్నారు.
శ్రీనగర్ డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ, నేటికీ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆలయంలో ప్రార్థనలు చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఆలయ మరమ్మతుల అనంతరం దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తారని భావిస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ..