AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి.. 20 మంది పరిస్థితి విషమం..

తమిళనాడులో ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఊపిరాడక, నోరు, ముక్కు నుంచి రక్తం కారుతూ కళ్లముందే ఉద్యోగులు కుప్పకూలిపోవడంతో అక్కడ విషాదం వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగిందంటే..?

తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి.. 20 మంది పరిస్థితి విషమం..
Gas Leakage At Tamil Nadu Sea Food Factory
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 5:12 PM

Share

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరులో సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 40మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 20మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 70 నుంచి 80 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. కన్నికైపయ్యార్ గ్రామంలో ఉన్న ఈ రొయ్యల ఫ్యాక్టరీలో ప్రతిరోజూ లాగే ఆదివారం ఉదయం కూడా కార్మికులు తమ విధుల్లో మునిగిపోయారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ప్లాంట్ నుండి అమ్మోనియా గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. క్షణాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ అంతా గ్యాస్ వ్యాపించడంతో.. ఊపిరి పీల్చుకోవడం కష్టమై కార్మికులు గాల్లో తేలినట్లు అయిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ తీవ్రత కారణంగా కొందరికి ముక్కు, నోటి నుండి రక్తస్రావం కూడా జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక గ్యాస్ డిటెక్టర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్లు, ఆధునిక రెస్క్యూ పరికరాలతో కూడిన 30 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని వెంటనే మంజనగరనైలోని ప్రైవేట్ ఆసుపత్రితో పాటు వేల్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా మంత్రి కుమార్ బాధితులను పరామర్శించి, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తమిళనాడు గవర్నర్ తీవ్ర సంతాపం

ఈ ఘోర ప్రమాదంపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై దర్యాప్తుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లోనే ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మరోవైపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పెరియపాలయం రొయ్యల ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

Follow Us