AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!

మాల్‌ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు రూ.99, రూ.199, రూ.499, రూ.999 వంటి ధరలు తరచుగా కనిపిస్తుంటాయి. రూ.100కు బదులు రూ.99, రూ.1000కు బదులు రూ.999గా ధర నిర్ణయించడం వెనుక కంపెనీల మార్కెటింగ్‌ వ్యూహం దాగి ఉంది. దీనినే ‘చార్మ్ ప్రైసింగ్‌’ అంటారు. 9తో ముగిసే ధరలు వినియోగదారులకు వాస్తవ ధర కంటే కొంత చౌకగా అనిపించేలా చేసి, కొనుగోలు నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. ఈ చిన్న మానసిక వ్యూహాన్ని కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి ఎలా ఉపయోగిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!
Shopping Psychology
Srilakshmi C
|

Updated on: Aug 10, 2026 | 1:44 PM

Share

మాల్‌కు వెళ్లినా, మార్కెట్‌లో షాపింగ్ చేసినా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనాలన్నా.. ముందుగా చూసేది దాని ధరే. అయితే మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? చాలా ఉత్పత్తుల ధరలు రూ.99, రూ.199, రూ.499, రూ.999, రూ.10,999 ఇలా 9 అంకెతో ముగుస్తుంటాయి. కంపెనీలు కావాలనే రూ.100కి బదులుగా రూ.99, రూ.500కి బదులుగా రూ.499, రూ.1,000కి బదులుగా రూ.999 ధరను నిర్ణయిస్తుంటాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు అనుసరించే ఒక ప్రసిద్ధ మార్కెటింగ్ వ్యూహం. దీనినే సాధారణంగా ‘చార్మ్ ప్రైసింగ్’ (Charm Pricing) అంటారు.

రూ.100కి బదులు రూ.99 ఎందుకు?

మనిషి ఏదైనా ధరను చూసినప్పుడు సాధారణంగా ఎడమవైపు ఉన్న అంకెలను ముందుగా గుర్తిస్తాడు. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ.499గా ఉంటే.. అది రూ.500కి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తక్కువ. అయినప్పటికీ మన మెదడు ముందుగా ‘4’ అనే అంకెను గమనిస్తుంది. దీంతో రూ.499 ధరను చూసినప్పుడు అది రూ.500 కంటే రూ.1 తక్కువగా ఉందనే దానికంటే, ‘400లలో ఉన్న ధర’గా మనకు అనిపించే అవకాశం ఉంటుంది. అదే వస్తువును రూ.500గా చూపిస్తే మాత్రం అది మరో ధర శ్రేణిలో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఈ చిన్న తేడాను కంపెనీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటాయి.

ఇది ఒక మానసిక ధరల వ్యూహం

మార్కెటింగ్‌లో 9తో ముగిసే ధరలను ‘చార్మ్ ప్రైసింగ్’గా పిలుస్తారు. ఉదాహరణకు ఒకే రకమైన రెండు ఉత్పత్తుల్లో ఒకదాని ధర రూ.200, మరొకదాని ధర రూ.199గా ఉంటే.. రూ.199 ధర ఉన్న ఉత్పత్తి వినియోగదారులకు కొంత చౌకగా అనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాల్‌లో రూ.999 ధర ఉన్న దుస్తులను చూసినప్పుడు, మనకు అది రూ.1,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే. అయినప్పటికీ ధరను చూపించే విధానం వినియోగదారుడి ధరపై ఉన్న అవగాహనను ప్రభావితం చేయగలదు. ఇది ఒక మానసిక ధరల వ్యూహం రూ.500 లేదా రూ.1000 వంటి రౌండ్ ఫిగర్ ధరలు వినియోగదారులకు స్పష్టంగా, కొంత ఎక్కువగా అనిపించవచ్చు. అదే వస్తువును రూ.499 లేదా రూ.999గా చూపిస్తే మాత్రం ధర కొంత తక్కువగా ఉన్న భావన కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు..

  • రూ.500 → రూ.499
  • రూ.1,000 → రూ.999
  • రూ.600 → రూ.599
  • రూ.2,000 → రూ.1,999

డబ్బు ఆదా చేస్తున్నామనే భావన..

ప్రతి సందర్భంలోనూ తగ్గింపు కేవలం రూ.1 మాత్రమే. అయినప్పటికీ ధరను చూసే విధానం మారుతుంది. ఈ మానసిక ప్రభావం వినియోగదారుడిని ఉత్పత్తి వైపు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. రూ.199 ధరను చూసినప్పుడు అది ఏదో ప్రత్యేక ఆఫర్ లేదా డిస్కౌంట్‌లో లభిస్తున్న వస్తువులా అనిపించవచ్చు. అదే వస్తువు రూ.200గా ఉంటే మాత్రం అది సాధారణ ధరగా అనిపిస్తుంది. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. రూ.199 అనేది నిజంగా పెద్ద డిస్కౌంట్ కాదు. రూ.200తో పోలిస్తే కేవలం రూ.1 మాత్రమే తక్కువ. కానీ ఆ ఒక్క రూపాయి తేడా వినియోగదారుడిలో ‘కొంచెం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నాను’ అనే భావనను కలిగించవచ్చు. ఈ చిన్న మానసిక ప్రోత్సాహం వల్ల కొంతమంది తమకు తక్షణ అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ధరల విధానం కేవలం మాల్స్‌, దుకాణాలకే పరిమితం కాదు. ఆన్‌లైన్ షాపింగ్‌ సైట్లలోనూ రూ.499, రూ.999, రూ.1,499, రూ.2,999 వంటి ధరలు తరచుగా కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ఒకేసారి అనేక ఉత్పత్తుల ధరలను పోల్చే సమయంలో కూడా ఇలాంటి ధరలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ‘డీల్’, ‘ఆఫర్’, ‘సేల్’ వంటి పదాలతో కలిపి 9తో ముగిసే ధరలను చూపించడం కొనుగోలు నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రతి 9 ధర నిజంగానే చౌకేనా?

ఇక్కడ వినియోగదారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధర రూ.999గా ఉందని అది తప్పనిసరిగా రూ.1000 కంటే గొప్ప డీల్ అని అర్థం కాదు. అసలు ఉత్పత్తి విలువ, నాణ్యత, ఇతర దుకాణాల్లో ఉన్న ధర, అవసరం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. కేవలం రూ.1 తక్కువగా ఉందనే కారణంతో వెంటనే కొనుగోలు చేయకుండా, ‘నాకు ఈ వస్తువు నిజంగా అవసరమా?’, ‘ఇతర చోట్ల దీని ధర ఎంత ఉంది?’ అని ఆలోచించడం మంచిది. రూ.99, రూ.199, రూ.499, రూ.999 వంటి ధరలు యాదృచ్ఛికంగా నిర్ణయించబడినవి కావు. వినియోగదారులు ధరను ఎలా చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు, కొనుగోలు నిర్ణయం ఎలా తీసుకుంటారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీలు చార్మ్ ప్రైసింగ్ వంటి వ్యూహాలను ఉపయోగిస్తాయి. కాబట్టి ఇకపై షాపింగ్‌ చేసే సమయంలో రూ.999 ధర కనిపిస్తే.. రూ.1000 కంటే కేవలం ఒక్క రూపాయి తక్కువ’ అని గుర్తుంచుకోండి. ధరలో కనిపించే చిన్న మార్పు మన కొనుగోలు నిర్ణయంపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకుంటే.. అవసరం లేని ఖర్చులను కూడా కొంతవరకు నియంత్రించుకోవచ్చు.

Follow Us