ఇదెక్కడి విడ్డూరం.. 4 లీటర్ల పెయింట్ వేసేందుకు 233 మంది కూలీలా!
10 కిటికీలు, 4 తలుపులకు రంగులు వేసేందుకు ఎంత మంది అవసరం అవుతారు.. ఒకరు, మహా అయితే ఇద్దరు. కానీ మధ్యప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన ఓ ప్రభుత్వ స్కూల్‌లో కిటికీలు, తలుపులకు రంగులు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలను, 65 మంది మేస్త్రీలను నియమించినట్లు ఓ అధికారి లెక్కలు చూపించి లక్షల రూపాయలు కాజేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించేందుకు ఓ అధికారి చేసిన ప్రయత్నం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం 10 కిటికీలు, 4 తలుపులకు రంగులు వేయించడానికి ఏకంగా 275 మంది కూలీలను, 150 మంది మేస్త్రీలను నియమించినట్లు అతను ఫేక్ పత్రాలను సృటించి అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, షాడోల్ జిల్లాలోని నిపానియా గ్రామంలో కొత్తగా ఓ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగింది. అయితే ఈ పాఠశాలలో నూతన గదులకు ఏర్పాటు చేసిన కిటికీలు, తలుపులకు రంగులు వేసేందుకు సుధాకర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థకు అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు.
కాంట్రాక్ట్ తీసుకున్న సుధాకర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ పాఠశాలలోని గదులకు ఉన్న 10 కిటికీలు, 4 తలుపులకు రంగులు వేసి పని పూర్తి చేసింది. అయితే ఇందుకోసం మొత్తం 10 కిటికీలు, 4 తలుపులకు 20 లీటర్ల పెయింట్ వేయడానికి రూ. 2.3 లక్షల ఖర్చు అయినట్టు సుధాకర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అధికారులకు బిల్లును సమర్పించింది. రంగులు వేసేందుకు 275 మంది కూలీలు, 150 మంది మేస్త్రీలను నియమించినట్టు పేర్కొంది. అది చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఇంత చిన్న పనికి ఇంతమందిని నియమించడమేంటని ఆశ్చర్యపోయారు.
అచ్చం ఇలాంటి ఘటనే సకండి గ్రామంలోని కూడా వెలుగు చూసింది. గ్రామంలోని పాఠశాలలో కేవలం నాలుగు లీటర్ల పెయింట్ వేయడానికి 168 మంది కూలీలు, 65 మంది మేస్త్రీలు అవసరమయ్యారని.. ఇందు కోసం రూ. 1.07 లక్షలు ఖర్చు అయినట్టు కాంట్రాక్టర్ బిల్లు పెట్టాడు.
అయితే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. నిపానియా పాఠశాలకు సంబంధించిన బిల్లును సుధాకర్ సంస్థ మే 5న సమర్పించగా, పాఠశాల ప్రిన్సిపాల్ మాత్రం నెల రోజుల ముందే, అంటే ఏప్రిల్ 4వ తేదీనే ఆ బిల్లును పరిశీలించి ఆమోదించాడట. ఈ దుర్వినియోగానికి సంబంధించిన విషయాన్ని గుర్తించిన కొందరు అధికారులు ఈ బిల్లులకు సంబంధించిన ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.